
* జూబ్లీహిల్స్‌లో వేడెక్కిన రాజకీయాలు
* టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను కలుస్తున్న నవీన్
* అందరినీ కలుపుకుని పోతానని వ్యాఖ్య
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిగా వల్లాల నవీన్యాదవ్ను అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. “ఆకేరు న్యూస్” ఈ విషయాన్ని ముందే అంచనా వేసింది. ఆశావహుల్లో హేమాహేమీలు ఉన్నప్పటికీ అధిష్ఠానం చివరకు నవీన్‌యాదవ్ వైపే మొగ్గుచూపింది. ముగ్గురి పేర్లను ఢిల్లీకి సిఫారసు చేసినప్పుడే “ఆకేరు న్యూస్” ఈ విషయాన్ని తన వెబ్సైట్లో ప్రచురించింది. నియోజకవర్గ రాజకీయాలను, ఆశావహులతో స్థానికంగా ఉన్న పరిచయాలను, ఇప్పటికే వారు ప్రచారంలో ఉన్న తీరును నిశితంగా పరిశీలించి నవీన్‌యాదవ్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. కాంగ్రెస్ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్‌యాదవ్ అని ఎప్పుడో ప్రచురించింది. ఇప్పుడు అదే నిజం కావడం ఆయన శిబిరంలో జోష్ నింపింది.
జూబ్లీహిల్స్‌లో వేడెక్కిన రాజకీయాలు
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అభ్యర్థిని ఎప్పుడో ప్రకటించింది. ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ కూడా నవీన్యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచీ జూబ్లీహిల్స్‌లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. బీజేపీ అభ్యర్థి ఎంపిక కూడా తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో నేడో, రేపో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అధికారికంగా అభ్యర్థిత్వం ఖరారైన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు నవీన్ యాదవ్, మాగంటి సునీత ప్రచారంపై దృష్టి సారించారు. పోలింగ్‌కు నెల రోజులే సమయం ఉండడంతో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను కలుపుకుని వెళ్లేందుకు నవీన్‌యాదవ్ సిద్ధమయ్యారు.
ప్రచార అస్త్రాలకు పదును
నవీన్ యాదవ్‌కు స్థానికుడిగా పేరుంది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడం ఆయనకు కలిసి రానుంది. గత పదేళ్ల బీఆర్ఎస్ సర్కార్‌లో నియోజకవర్గంలో ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని ఆయన ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు. స్థానికంగా రేషన్ కార్డుల పంపిణీ, రూ.500కే గ్యాస్, మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ వంటి సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని ఆయన ధీమాగా ఉన్నారు. నవీన్‌యాదవ్ కొంత కాలంగా ప్రజల్లోనే ఉంటున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బస్తీలు, కాలనీల్లో పర్యటిస్తున్నారు. గతంలోనూ ఆయన ఎంఐఎం నుంచి బరిలో నిలిచారు. ఇండిపెండెంట్‌గానూ పోటీ చేశారు.
…………………………………………….