* కేంద్ర బలగాల పహారా
* ప్రతీ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
జూబ్లీహిల్స్ ఉప పోరు పోలింగ్ సరిగ్గా ఏడుగంటలకు మొదలైంది. నిన్న సాయంత్రమే ఎన్నికల సామగ్రి కేంద్రాలకు వచ్చేసింది. ఉదయం 6 గంటలకే సిబ్బంది అన్నింటినీ క్రమపద్ధతిన ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు. మాక్ పోలింగ్ నిర్వహించారు. అంతా ఓకే అయ్యాక 7 గంటలకు పోలింగ్ ప్రారంభించారు. ఓటింగ్ కోసం 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సగటున ఒక్కో పోలింగ్ కేంద్రంలో 986 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా 263 పోలింగ్ కేంద్రంలో 540 మంది ఓటర్లు (పీఎస్ నెంబర్-263), అత్యధికంగా పోలింగ్ కేంద్రంల-9లో 1233 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, ఇతర సిబ్బందితో కలిపి 2060 మంది విధులు నిర్వర్తించనున్నారు. 1760 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు.
నోటాతో కలిపి 59 గుర్తులు
ఉప ఎన్నిక పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఉన్నతాధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు, మొబైల్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. తొలిసారిగా బయట డ్రోన్ల ద్వారా నిఘా ఉంటుంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సహాయ, మొబైల్ డిపాజిట్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. 58 మంది అభ్యర్థులు నోటాతో కలిపి 59 గుర్తులు ఉండాల్సిన దృష్ట్యా.. ఒక్కో కేంద్రంలో నాలుగు బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నారు. రిజర్వ్‌తో కలుపుకొని మొత్తం 2394 బ్యాలెట్ యూనిట్లు, 561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్ యంత్రాలు వినియోగిస్తున్నారు.
ఎవరి గుర్తుపై నొక్కేనో?
జూబ్లీహిల్స్‌లో కొందరు ఓటర్ల తీరు ఇప్పటికీ గుంభనంగానే ఉంది. డబ్బులు అందకముందు ఒక విధంగా, డబ్బులు అందిన తర్వాత మరో విధంగా మారింది. జూబ్లీహిల్స్‌లోని అత్యధిక ఓటర్లను డబ్బులు ప్రభావితం చేస్తున్నాయి. ఎవ్వరూ ఎంతిచ్చారనేది కొందరూ ఓటర్లు లెక్కలు వేస్తుండగా. మరికొందరైతే డబ్బులు అందాయా.? లేదా? అనేది చర్చించుకుంటున్నారు. రహమత్‌నగర్‌లో ఓ పార్టీ పట్ల ఎంతో సానుభూతితో ఉన్న ఓ కుటుంబానికి మరో పార్టీ డబ్బులు ఇవ్వడంతో ఆలోచనలో పడ్డారు. డబ్బులు తీసుకొని మరీ ఆ పార్టీకి ఓటు వేయ్యకపోతే మనఃసాక్షి అంగీకరించదని కుండబద్ధలు కొడుతున్నారు. మరో పార్టీ వద్ద డబ్బులు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఇటువంటి తరుణంలో ఎవరి గుర్తుపై నొక్కుతారో, ఏ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేను చేస్తారో అంతుచిక్కడం లేదు.
………………………………………………………………
