* వైద్య, ఆరోగ్యానికి అరకొర కేటాయింపులపై ఎన్డీఏకు చురకలు
* ఓ డాక్టర్‌గా, ఎంపీగా సమస్యలపై తనదైనశైలిలో స్పందన
* కేన్సర్ నిర్ధారణ పరీక్షల్లో రాయితీ కల్పించాలని డిమాండ్
* రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయాలని వినతి
ఆకేరు న్యూస్ వరంగల్ : కేంద్ర బడ్జెట్లో వైద్య, ఆరోగ్య పద్దులకు సంబంధించి వరంగల్ ఎంపీ కడియం కావ్య పార్లమెంట్లో ఇచ్చిన స్పీచ్ చర్చనీయాంశంగా మారింది. వైద్య రంగానికి అరకొర కేటాయింపులపై ఓ డాక్టర్ గా, ఎంపీగా తనదైన శైలిలో స్పందించారు. లోటుపాట్లను ఎత్తిచూపారు. తొలుత ఇక్కడ ఎంపీగా నిలబడేందుకు కారణమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని, తండ్రి కడియం శ్రీహరిని తలుచుకుని బడ్జెట్ పై ప్రసంగం ప్రారంభించిన కావ్య.. ఏకధాటిగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి అర్థం అయ్యేలా ఇంగ్లిష్ లో అదరగొట్టారు. మధ్యలో గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు.. అంటూ తెలుగు సూక్తులను సైతం ఉటంకిస్తూ.. వైద్య ఆరోగ్య రంగ అబివృద్ధికి క్వాంటిటీ కన్నా క్వాలిటీ ప్రధానమని కేంద్రానికి సూచించారు. వైద్య, ఆరోగ్యానికి అరకొర కేటాయింపులపై ఎన్డీఏకు చురకలు అంటూ విమర్శలు సంధించారు. ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ పేరిట నెలకొల్పిన పథకం పేదల ఆయుష్షు పెరిగేందుకు ఉపయోగపడట్లేదని, అరకొర నిధులతో పేదలను ఆరోగ్యవంతులను చేసేలా లేవని కావ్య అభిప్రాయపడ్డారు. కొవిడ్ మేనేజ్మెంట్లో అద్భుత విజయం సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం.. సాధారణ ఆరోగ్య రంగంలో చేస్తుంది ఏం లేదని కావ్య ఎద్దేవా చేశారు. అరకొర నిధుల కేటాయింపుపై మరోసారి ఆలోచించాలని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బాలికల ప్రధాన సమస్యల పట్ల ఉన్న చిత్తశుద్ధిని కొనియాడుతూ గతంలో తెలంగాణలో కూడా మెనుస్ట్రవల్ హైజీన్ విషయంలో కడియం శ్రీహరి మంత్రిగా ఉన్నప్పుడు చేపట్టిన చర్యలను సభలో ప్రస్తావించారు. కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల విషయంలో పేదల కుటుంబాలు ఇళ్లు గుల్లా అవుతాయని, వారి ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని కేన్సర్ నిర్ధారక పరీక్షలు మొదలుకొని నివారణకు చెందిన చికిత్సల్లో రాయితీలు కల్పించాలని కావ్య సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బాధితులు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు కేటాయిస్తున్న విషయాన్ని ఈసందర్భంగా ప్రస్తావించారు.
నిధులు విడుదల చేయండి..
వరంగల్ జిల్లాలో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు సహకరించాలన్న తన విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డి.. అంతర్జాతీయ స్థాయిలో 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మంజూరు చేశారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ వైద్య మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం 2023కు సంబంధించి రావాల్సిన 333 కోట్ల నిధులను, 2024కు చెందిన 138 కోట్ల బకాయిలను విడుదల చేయాలని కోరారు. వ్యక్తి ఆరోగ్యమే దేశ ఆరోగ్యానికి ఉపకరిస్తుందని గుర్తు చేశారు. కాజీపేట కేంద్రంగా రైల్వే జంక్షన్ ఆవశ్యకతను కూడా వివరించారు. ఇక్కడి రైల్వే ఉద్యోగులకు ప్రస్తుతం ఇక్కడ ఉన్న హాస్పిటల్ ద్వారా అందుతున్న సేవలు పరిమితంగా ఉన్నాయని ఎంపీ డాక్టర్ కావ్య కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ, సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే చాలా సమయం అయిందని, స్పీచ్ ముగించాలని స్పీకర్ పేర్కొంటున్నప్పటికీ.. ఒన్ మరో మినిట్ సార్.. అని రిక్వెస్ట్ చేసి మరీ కడియం కావ్య రాష్ట్ర సమస్యలను, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ పార్లమెంట్ పరిధిలోని సమస్యలను పార్లమెంట్ లో ప్రస్తావించి ఆకట్టుకున్నారు.
————————————-