Governor Shiv Pratap Shukla
* వికసిత భారత్‌లో యూనివర్సిటీలదే కీలక పాత్ర
* గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కీలక ప్రసంగం
* 2029 నాటికి నషాముక్త భారత్ లక్ష్యం..
* యువతకు గవర్నర్ పిలుపు
ఆకేరు న్యూస్, హనుమకొండ : విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, వికసిత భారత్–2047 లక్ష్య సాధనలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్, కాకతీయ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివ ప్రతాప్ శుక్లా (Governor Shiv Pratap Shukla) పిలుపునిచ్చారు. విద్య కేవలం డిగ్రీలు పొందేందుకు మాత్రమే పరిమితం కాకుండా.. సమాజంలో సానుకూల మార్పు తీసుకొచ్చే బాధ్యతాయుత పౌరులను తీర్చిదిద్దాలని సూచించారు.
శనివారం హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవంలో గవర్నర్ (Governor Shiv Pratap Shukla) పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా 2022-23, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాల్లో పట్టాలు పొందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా పీహెచ్డీ పట్టాలు అందుకున్న పరిశోధకులు, బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పట్టభద్రులకు డిగ్రీలను ప్రదానం చేశారు.

50 ఏళ్ల విద్యా ప్రస్థానంలో కాకతీయ విశ్వవిద్యాలయం..
కాకతీయ విశ్వవిద్యాలయం 50 ఏళ్ల విద్యా ప్రస్థానాన్ని, స్వర్ణోత్సవ సంవత్సరాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ స్నాతకోత్సవానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని గవర్నర్ పేర్కొన్నారు. 1976 ఆగస్టు 19న స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం తెలంగాణలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పిస్తూ అనేక కుటుంబాల్లో తొలి తరం పట్టభద్రులను తయారు చేసిందన్నారు. మహిళలకు విద్య, ఉద్యోగ, నాయకత్వ అవకాశాలను విస్తరించడంలోనూ విశేష పాత్ర పోషించిందని కొనియాడారు.
2023లో కాకతీయ విశ్వవిద్యాలయం NAAC A+ గ్రేడ్ సాధించడం సమష్టి కృషికి నిదర్శనమని అన్నారు. నాణ్యమైన బోధన, పరిశోధన, సమర్థవంతమైన పరిపాలనతో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని సూచించారు. విద్యార్థుల విజయాల్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, పరిశోధనా మార్గదర్శకుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
ఏఐ, డేటా సైన్స్‌కు అనుగుణంగా విద్యా వ్యవస్థ..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డిజిటల్ టెక్నాలజీలు, నైపుణ్యాభివృద్ధి వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని గవర్నర్ సూచించారు. జాతీయ విద్యా విధానం–2020 విద్యను సమగ్రంగా, సౌకర్యవంతంగా, సమాజ అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. విద్యార్థులకు ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, ప్రాక్టికల్ లెర్నింగ్, పరిశోధనా అవకాశాలు కల్పించాలని అన్నారు.
విద్యలో నాణ్యతతో పాటు సమాన అవకాశాలు, దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించాలని, వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఏఐ వంటి సాంకేతికతలు సమాచార విశ్లేషణ, సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతున్నప్పటికీ.. నిర్ణయాల బాధ్యత మాత్రం మానవులదేనని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారాన్ని గుర్తించి ప్రశ్నించే వివేకాన్ని పెంపొందించుకోవాలని అన్నారు.

2029 నాటికి నషాముక్త భారత్ లక్ష్యం..
యువతను మాదకద్రవ్యాల దుష్ప్రభావాల నుంచి రక్షించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని గవర్నర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వివిధ రంగాల్లో ముందుకు సాగుతోందని, 34కు పైగా దేశాలు ప్రధానమంత్రిని తమ అత్యున్నత పౌర పురస్కారాలతో గౌరవించాయని తెలిపారు. యువత ‘నేషన్ ఫస్ట్’ నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
2029 నాటికి మాదకద్రవ్యాల రహిత భారతదేశాన్ని నిర్మించాలన్న లక్ష్య సాధనకు యువత తమ వంతు సహకారం అందించాలని కోరారు. విద్యాసంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించాలని సూచించారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోనూ నషాముక్త భారత్‌పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

పరిశోధనలు సమాజానికి ఉపయోగపడాలి..
ఔషధ పరిశోధన, మెటీరియల్స్, ఔషధ మొక్కలు, డిజిటల్ వ్యవస్థలు వంటి రంగాల్లో పరిశోధనలు సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలను అందించగలవని గవర్నర్ అన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, నీరు, ఇంధనం, సాంకేతికతతో పాటు విద్య, చరిత్ర, భాష, న్యాయం, ప్రజా విధానాలు, సామాజిక మార్పులపై కూడా పరిశోధనలు జరగాలని సూచించారు.
పీహెచ్డీ పరిశోధకులు వాస్తవాలు, ఆధారాలకు ప్రాధాన్యతనిస్తూ అకడమిక్ నైతికతను పాటించాలని, తమ పరిశోధనలు సమాజానికి ఉపయోగపడేలా కృషి చేయాలని కోరారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు తమ విజయాన్ని ఇతరులకు స్ఫూర్తిగా నిలిపి, వినయంతో జ్ఞానాన్ని పంచుకోవాలని అన్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జాతీయ సేవా పథకం (NSS), జాతీయ క్యాడెట్ కార్ప్స్ (NCC) ద్వారా విద్యార్థులు క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, సేవా దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులకు మార్గదర్శకులుగా నిలవాలని కోరారు.
విద్య, పరిశ్రమల మధ్య సమన్వయం అవసరం..
విద్య, ఉపాధి మధ్య సమన్వయం పెంపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమల భాగస్వామ్య కార్యక్రమాలు యువతకు అవకాశాలను కల్పిస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల కళాశాలల విద్యార్థులకు కూడా డిజిటల్ వనరులు, మెంటర్లు, ప్రాక్టికల్ లెర్నింగ్ అవకాశాలు అందుబాటులో ఉండాలని సూచించారు.
విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వం, పరిశ్రమలు, పూర్వ విద్యార్థులు సమన్వయంతో పనిచేస్తే తెలంగాణ అభివృద్ధితో పాటు దేశ ప్రగతికి మరింత బలమైన తోడ్పాటు అందించగలరని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ‘రైజింగ్ తెలంగాణ’ దార్శనికత, కేంద్ర ప్రభుత్వ ‘వికసిత భారత్–2047’ సంకల్పం ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చే ఉమ్మడి లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
‘Learn, Build and Lead’ అంటూ మోహన్ రెడ్డి పిలుపు..
స్నాతకోత్సవ సందేశం ఇచ్చిన పద్మశ్రీ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి.. పట్టభద్రులు ‘Learn, Build and Lead’ నినాదంతో ముందుకు సాగాలని సూచించారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి కేయూ చేపట్టిన విద్యా సంబంధిత కార్యక్రమాలు, పురోగతిని వివరించారు.
గవర్నర్‌కు ఘన స్వాగతం..
స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్న గవర్నర్‌కు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పేయి, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, పోలీస్ కమిషనర్ శ్వేత, NPDCL సీఎండీ వరుణ్ రెడ్డి, కేయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అనంతరం NIT వీఐపీ గెస్ట్ హౌస్ వద్ద గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
Also Read : కొత్త తరహా క్రెడిట్ కార్డ్ మోసం..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

