PM Narendra Modi
* నవంబర్ 30 నుంచి పార్లమెంట్లో చర్చ
* మహిళలకు చట్టసభల్లో 33 శాతం కోటా..
* అమలుకు కేంద్రం కొత్త అడుగులు
* నారీ శక్తికి ఇచ్చిన హామీ నెరవేరుస్తాం
ఆకేరు న్యూస్, డెస్క్ : చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు (Women Reservation Bill) కల్పించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక చర్యలకు సిద్ధమైంది. నారీ శక్తికి ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) స్పష్టం చేశారు.
మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని ఎవరూ ఎక్కువ కాలం అడ్డుకోలేరని, అది కేవలం సమయం మాత్రమేనని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ప్రధాని మోదీ (Narendra Modi) శనివారం వీడియో సందేశం విడుదల చేశారు.
మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించేందుకు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
* 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..
మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. లోక్సభ సమావేశాలు నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో జరగనుండగా, రాజ్యసభ డిసెంబర్ 2, 3 తేదీల్లో సమావేశం కానుంది. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లతో పాటు నియోజకవర్గాల పునర్విభజన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
* లోక్సభలో 850 సీట్లకు ప్రతిపాదన..
కేంద్ర కేబినెట్ ఆమోదించిన తాజా ప్రతిపాదనల ప్రకారం లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్యను ప్రస్తుత 550 నుంచి 850కి పెంచాలని భావిస్తున్నారు. రాష్ట్రాల శాసనసభల గరిష్ట సభ్యుల సంఖ్యను కూడా 500 నుంచి 650కి పెంచే ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం లోక్సభలో 543 స్థానాలు ఉండగా, నియోజకవర్గాల పునర్విభజన ద్వారా సీట్ల సంఖ్యను పెంచే యోచనలో కేంద్రం ఉంది.
ఈ ప్రతిపాదనల ప్రకారం లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రాల వారీగా ప్రస్తుత లోక్సభ స్థానాల కేటాయింపును 50 శాతం పెంచే విధానాన్ని కూడా ప్రతిపాదించింది.
* 2029 ఎన్నికల నాటికి అమలు లక్ష్యం..
2029 లోక్సభ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందుకోసం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రతిపాదిస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం నియోజకవర్గాల సరిహద్దుల పునర్విభజనకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని భావిస్తున్నారు.
అయితే ఈ బిల్లులు ఆమోదం పొందాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ తప్పనిసరి. గతంలో ఏప్రిల్లో ప్రవేశపెట్టిన సంబంధిత బిల్లు లోక్సభలో అవసరమైన మెజారిటీ సాధించలేకపోయింది.
* నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ చర్చ..
మహిళా రిజర్వేషన్ల అమలుతో పాటు నియోజకవర్గాల పునర్విభజనను అనుసంధానించడంపై రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మహిళలకు రిజర్వేషన్లు త్వరగా అమలు చేయాలని ప్రతిపక్షాలు కోరుతుండగా, పునర్విభజన ప్రక్రియలో రాష్ట్రాల ప్రాతినిధ్యానికి భంగం కలగకూడదనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా తీసుకొచ్చిన ప్రతిపాదనలు పార్లమెంట్లో ఎలాంటి చర్చకు దారితీస్తాయి? బిల్లులకు అవసరమైన మద్దతు లభిస్తుందా? 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు (Women Reservation Bill) అమల్లోకి వస్తాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Also Read : కొత్త తరహా క్రెడిట్ కార్డ్ మోసం..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

