* వెలుగుమట్ల బాధితుల కోసం కవిత పోరాటం…
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూబాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన పోరాటం ఉద్రిక్తతకు దారితీసింది. బాధితులకు మద్దతుగా ఖమ్మం అంబేడ్కర్ భవన్లో దీక్షకు దిగిన కవితను, డీఎస్పీ (DSP) అధ్యక్షుడు విశారదన్ మహరాజ్‌ను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు.
అర్ధరాత్రి నుంచే ఉద్రిక్తత:
సోమవారం రాత్రి విశారదన్ మహరాజ్‌తో కలిసి కల్వకుంట్ల కవిత వెలుగుమట్ల బాధితులకు అండగా నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే, మంగళవారం ఉదయం పోలీసులు భారీగా చేరుకుని దీక్షను భగ్నం చేశారు. కవితతో పాటు దీక్షలో పాల్గొన్న వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి హైదరాబాద్ వైపు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులకు, జాగృతి కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.
తగ్గేదే లేదన్న కవిత: హైదరాబాద్‌లో దీక్ష ప్రారంభం
పోలీసు అరెస్టులపై కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని ఆమె స్పష్టం చేశారు. ఖమ్మం నుంచి విడుదలైన అనంతరం నేరుగా హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి చేరుకున్న ఆమె, అక్కడ తన నిరవధిక నిరాహార దీక్షను పునఃప్రారంభించారు.
ప్రభుత్వం ముందు ఉంచిన ప్రధాన డిమాండ్లు:
స్థలాల కేటాయింపు: ప్రభుత్వం వెలుగుమట్లలో కూల్చివేసిన చోటునే బాధితులకు తిరిగి ఇంటి స్థలాలు ఇవ్వాలి.
ఇందిరమ్మ ఇళ్లు: నిరాశ్రయులైన ప్రతి కుటుంబానికి తక్షణమే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలి. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు విశ్రమించేది లేదని ఆమె ప్రకటించారు.
మద్దతుగా తరలివస్తున్న కార్యకర్తలు:
కవిత దీక్షకు మద్దతుగా తెలంగాణ జాగృతి శ్రేణులు, విపక్ష నాయకులు భారీగా తరలివస్తున్నారు. బాధితుల పక్షాన నిలబడిన తమ నాయకురాలిని అక్రమంగా అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడి వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
