వెలుగుమట్ల బాధితుల పక్షాన పోరాటం..
ఆకేరు న్యూస్,ఖమ్మం: అంబేద్కర్ భవన్లో బస చేస్తున్న వెలుగుమట్ల బాధితులను కల్వకుంట్ల కవిత పరామర్శించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్న ఆమె, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
మంత్రుల నిర్లక్ష్యం: “ఈ జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా, పేదల కష్టాలను పట్టించుకునే ‘సోయి’ ఒక్కరికీ లేదు. ఇక్కడి ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి తప్పక తగులుతుంది.”
బుల్డోజర్ రాజకీయం: “పెద్దల అక్రమ కట్టడాల జోలికి వెళ్లని ప్రభుత్వం, పేదల ఇళ్లపైకి మాత్రం బుల్డోజర్లను పంపిస్తోంది. రాహుల్ గాంధీ చేత పట్టుకునే రాజ్యాంగాన్ని ఇక్కడ తుంగలో తొక్కుతున్నారు. పేదల హక్కులను కాలరాస్తూ రాజ్యాంగాన్ని కూనీ చేస్తున్నారు.”
జెడ్పీ సెంటర్లో ఆందోళన – అధికారులతో చర్చలు….
బాధితులకు న్యాయం జరగాలంటూ కవిత ఆధ్వర్యంలో ఖమ్మం జెడ్పీ సెంటర్లో భారీ ధర్నా నిర్వహించారు. ఈ క్రమంలో ఖమ్మం ఆర్డీవో (RDO) కవితతో చర్చలు జరిపారు. అయితే, కవిత తన డిమాండ్లపై వెనక్కి తగ్గలేదు.
“కలెక్టర్ స్వయంగా ఇక్కడికి రావాలి. వెలుగుమట్ల బాధితులకు అదే స్థలంలో ఇంటి పట్టాలు ఇస్తామని, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు ఈ ఆందోళన విరమించే ప్రసక్తే లేదు” అని ఆమె స్పష్టం చేశారు.
ఉద్రిక్తత మరియు అరెస్టులు
ధర్నా కారణంగా జెడ్పీ సెంటర్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
నేతల అరెస్ట్: ఆందోళన చేస్తున్న కల్వకుంట్ల కవితతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, మరియు పలువురు వెలుగుమట్ల బాధితులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
నిబంధనల ఉల్లంఘన: మహిళా నేతలను అరెస్ట్ చేసే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు లేకపోవడాన్ని జాగృతి నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. చట్టాలను ఉల్లంఘిస్తూ పురుష పోలీసులు మహిళా కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కానిస్టేబుల్కు గాయం: ఆందోళన సమయంలో జరిగిన తోపులాటలో ఓ మహిళా కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఖమ్మం పట్టణంలో పోలీస్ బందోబస్తు పెంచారు. పేదలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని తెలంగాణ జాగృతి శ్రేణులు హెచ్చరిస్తున్నాయి.
