Double Bedroom Houses Kamalapur
* డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు
* తప్పుడు పత్రాలతో ఇళ్లు పొందితే ప్రొసీడింగ్స్ రద్దు
* ప్రభుత్వ పథకం పూర్తిగా ఉచితం, లబ్ధిదారులు ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు
– కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు
ఆకేరు న్యూస్, కమలాపూర్ : కమలాపూర్ మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో గుండెబాబు స్పష్టం చేశారు. ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అక్రమాలకు తావులేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
* దళారుల వసూళ్లపై తీవ్ర హెచ్చరిక
ఆ ఇళ్లు ఇప్పిస్తామంటూ కొంతమంది దళారులు, మధ్యవర్తులు అమాయక లబ్ధిదారుల పేర్లు జాబితాలో ఉన్నాయని చెప్పి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎంపీడీవో తెలిపారు. ప్రభుత్వం ఈ ఇళ్లను పూర్తిగా ఉచితంగా అందిస్తోందని, ఇందుకోసం లబ్ధిదారులు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే తమకు లేదా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అక్రమ వసూళ్లకు పాల్పడే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
* క్షేత్రస్థాయి విచారణ – అనర్హుల ప్రొసీడింగ్స్ రద్దు
ఇళ్ల కేటాయింపులో పారదర్శకతను పాటిస్తూ, క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల వివరాలపై పూర్తిస్థాయిలో మరోసారి విచారణ జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే ప్రొసీడింగ్స్ అందుకున్న వారిలో ఎవరైనా అనర్హులని తేలితే, వారి ప్రొసీడింగ్స్ తక్షణమే వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఆదాయం, సొంత ఇంటి స్థలం, ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా ఇళ్లు పొందిన అంశాలను పరిశీలించి తప్పుడు పత్రాలతో ఇళ్లు పొందినట్లు తేలితే వాటిని రద్దు చేసి నిజమైన అర్హులకు కేటాయిస్తామని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి సిఫార్సులకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. దళారుల మాయమాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దని, కేవలం అర్హులైన పేదలకు మాత్రమే న్యాయం జరిగేలా చూస్తామని ఎంపీడీవో గుండెబాబు విజ్ఞప్తి చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
