CMC Commissioner Srujana launched the One-Day One-Ward initiative
* సీఎంసీ కమిషనర్ వినూత్న కార్యక్రమం
* కాలనీవాసుల సమస్యల ఏకరువు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజల చెంతకే పాలన అనే వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కమిషన క్షేత్రస్థాయిలో పౌర సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే లక్ష్యంతో చేపట్టిన ‘వన్-డే వన్-వార్డ్’ (One Day One Ward) పేరుతో ప్రత్యేక కార్యక్రమం రూపొందించారు. ఈరోజు కూకట్ పల్లి సర్కిల్ గాయత్రినగర్ డివిజన్లో విజయవంతంగా నిర్వహించారు. డివిజన్లోని ఓ పార్కులో మంగళవారం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ప్రజా సమావేశానికి పర్వత్ నగర్, శ్రీ వివేకానంద నగర్, తులసి నగర్, లక్ష్మి నగర్, జ్యోతి నగర్, పద్మావతి నగర్, జనప్రియ నగర్, మిరాజ్ నగర్, అజీజ్ నగర్ తదితర కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీఎంసీ కమిషనర్ సృజన సమక్షంలో కాలనీవాసులు తమ ప్రాంతాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను ఏకరువు పెట్టారు.
* అధికారుల దృష్టికి సమస్యలు
ఈ సమావేశంలో వివిధ కాలనీల నుంచి రకరకాల సమస్యలు అధికారుల దృష్టికి వచ్చాయి. పద్మావతి నగర్ వాసులు తాగునీటి పైప్లైన్ పనులు పూర్తయిన తర్వాతే వీడీసీసీ రోడ్డు వేయాలని, కమ్యూనిటీ హాలుతో పాటు సున్నం చెరువు కట్ట అభివృద్ధి పనులు చేపట్టాలని కోరగా, జ్యోతి నగర్, లక్ష్మి నగర్ వాసులు తీవ్రరూపం దాల్చిన భూగర్భ డ్రైనేజీ (యూజీడీ) సమస్యలను, ముఖ్యంగా 300 ఎంఎం పైప్లైన్ ఆవశ్యకతను వివరించారు. ఇక జనప్రియ నగర్ ప్రతినిధులు క్రమం తప్పని చెత్త తరలింపు, రోడ్ల ఊడ్చివేత, విపరీతంగా పెరిగిన దోమల బెడదతో పాటు విద్యుత్ మీటర్లు, వీధి దీపాల పునరుద్ధరణ వంటి సమస్యలను అధికారుల ముందుంచారు.
* సత్వర పరిష్కారానికి ఆదేశం
ప్రజల నుంచి వచ్చిన విన్నపాలన్నింటినీ శ్రద్ధగా ఆలకించిన సీఎంసీ కమిషనర్ సృజన.. అక్కడే ఉన్న అధికారుల బృందాన్ని అప్రమత్తం చేశారు. ప్రజలు తెలిపిన సమస్యలపై ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా శీఘ్రంగా స్పందించాలని, సంబంధిత శాఖల మధ్య సమన్వయం పెంపొందించుకుంటూ వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ‘వన్-డే వన్-వార్డ్’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పౌర సేవలను మరింత వేగంగా ప్రజల చెంతకు చేరవేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
