ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వైభవంగా జరిగింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కమలాపూర్, ఉప్పల్, మర్రిపల్లి గూడెం, శనిగరం, అంబాల లో అర్చకులు అత్యంత వైభవంగా పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు దేవాలయాలలో క్యూ లైన్ లో స్వామి వారిని దర్శించుకున్నారు. మండలంలోని ఉప్పల్లో స్థానికంగా ప్రసిద్ధి గాంచిన శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వారంలో స్వామి వారు దర్శనమిచ్చారు. మూల విరాట్టుకు అర్చకులు ఏకాంతంగా కైంకర్యాలను నిర్వహించిన అనంతరం ఉత్తర ద్వారం నుండి భక్తులు ఉదయం 6 గంటల నుంచే స్వామి వారిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) రోజున ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారి దర్శనం చేసుకోవడం అత్యంత పుణ్యఫలం అని, సమస్త పాపాలు నశించి, మోక్షం లభిస్తుందని భక్తుల గట్టిగా నమ్ముతారు. కార్యక్రమంలో పురోహితులు శ్రీరంగం కృష్ణమాచార్యులు, లక్ష్మణాచార్యులు, హరీషాచార్యులు , శ్రీనివాసచార్యులు , భక్తులు పాల్గొన్నారు.
……………………………………………..

