* చెప్పినట్లుగానే దారుణ హత్య
* వెంటాడి.. వేటాడి.. రాళ్లతో చితక్కొట్టి..
* చిత్రహింసలకు గురి చేసి.. కత్తితో గొంతు కోసి..
* కరీంనగర్లో సంచలనంగా గ్యాంగ్ వార్
* హత్యకు ముందు ఫోన్లో చాలెంజ్‌లు
* వైరల్ గా ఆడియో కాల్
ఆకేరు న్యూస్, కరీంనగర్ : ‘నేను ఒక అయ్యకే పుట్టారా.. బరాబర్ చంపుతా.., దమ్ముంటే రారా.. ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తా.. తల తీసుకుపోతా..’ ఇవేవో సినిమాల్లోని డైలాగులు కావు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు రౌడీషీటర్లు ఫోన్లో చేసుకున్న చాలెంజ్‌లు. ఆ ఫోన్ కాల్ సోషల్‌మీడియలో వైరల్ గా మారింది. చెప్పినట్లుగానే ఒకరిని దారుణంగా చంపేశారు. ఈ గ్యాంగ్ వార్ కలకలం రేపుతోంది.
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలో ఇద్దరు రౌడీషీటర్ల మధ్య భూ వివాదం ఒకరి ప్రాణాలు తీసింది. పచ్చునూర్ కు చెందిన యువకుడు గోపు ప్రశాంత్ రెడ్డిని.. మరో గ్యాంగ్ కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేసింది. వెంటాడి వేటాడి చంపేసి మానకొండూర్ మండలం వెల్ది-పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి గ్రామాల మధ్య మానేర్ వాగులో శవాన్ని పడేశారు. 12 గంటల తర్వాత పోలీసులు శవాన్ని గుర్తించారు.
హత్యకు ముందు ఫోన్లో వారి మధ్య జరిగిన మాటల యుద్ధం సోషల్‌మీడియాలో కలకలం రేపుతోంది. పచ్చునూర్ కు చెందిన ప్రశాంత్ రెడ్డి అదే గ్రామానికి చెందిన నన్నపనేని రమేశ్ అలియాస్ జానీతో ఓ భూమి సెటిల్మెంట్ వ్యవహారంలో గొడవలు జరుగుతున్నాయి. భూవివాదంలో తలదూర్చిన ఇద్దరు ఒకరినొకరు నిన్ను చంపుతా అంటే నిన్నే చంపుతా అంటూ ఛాలెంజ్ చేసుకున్నారు.
పక్కా ప్రణాళికతో కిడ్నాప్ చేసి ఆపై దారుణంగా..
ప్రశాంత్ రెడ్డి తనను చంపుతాడనే భయంతో రమేశ్ తన స్నేహితుల సహకారంతో ప్రశాంత్ ను అంతమొందించాలని పక్కా ప్రణాళిక రూపొందించాడు. మూడు రోజులుగా ఆయన ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించారు. ప్రత్యర్థుల వ్యూహాన్ని పసిగట్టిన ప్రశాంత్ అప్రమత్తమై పక్క గ్రామమైన ఊటూరులో ఓ మిత్రుడి వద్ద తలదాచుకున్నాడు. అయినా అతడిని వదలలేదు. ఆ గ్రామానికి వెళ్లి ప్రశాంత్ ను వెంబడించి వేటాడారు. భయంతో పరుగెత్తిన ప్రశాంత్ పాడుబడ్డ బావిలో పడిపోయాడు.
బావిలో పడ్డ ప్రశాంత్ పై బండరాళ్లు వేసి దాడి చేశారు. తర్వాత వాళ్లే పైకి తీసుకొచ్చి కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. చిత్రహింసలకు గురిచేసి గొంతుకోసి హత్య చేసి పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి కరీంనగర్ జిల్లా వెల్ది గ్రామాల మధ్య మానేర్ వాగులో పడేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి 12 గంటల తర్వాత శవాన్ని వెలికితీశారు. రౌడీ షీటర్ల గ్యాంగ్ వార్ మర్డర్ కు దారి తీయడంతో ప్రశాంతంగా ఉన్న పచ్చునూరు గ్రామం ఒక్కసారిగా ఉల్లిక్కిపడింది. థ్రిల్లర్ సినిమాను తలపించేలా సాగిన హత్యోదాంతంపై పోలీసులు సీరియస్ గా స్పందించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ నేతృత్వంలో మానకొండూర్ సీఐ రాజ్ కుమార్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
————————