* కర్ణాటక హోంమంత్రి క్లారిటీ!
ఆకేరు న్యూస్, డెస్క్:దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ. 400 కోట్ల నగదు కంటైనర్ దోపిడీ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీస్తోంది. గోవా-కర్ణాటక సరిహద్దుల్లో జరిగిన ఈ భారీ దోపిడీపై కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర స్పందించారు. ఈ కేసు విచారణ ఏ దశలో ఉంది? అసలు ఆ డబ్బు ఎక్కడిది? అనే అంశాలపై కీలక వివరాలు వెల్లడించారు.గుజరాత్ నుంచి బయలుదేరిన ఒక భారీ కంటైనర్ మహారాష్ట్ర, గోవా మీదుగా కర్ణాటకలోకి ప్రవేశించి, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చేరుకోవాల్సి ఉంది. అయితే, గోవా-కర్ణాటక సరిహద్దుల్లోని చర్లకొండ మార్గంలో గుర్తు తెలియని దుండగులు ఈ కంటైనర్ను అడ్డుకుని, దారి మళ్లించి దోపిడీకి పాల్పడ్డారు. సుమారు 400 కోట్ల రూపాయల విలువైన సొత్తు మాయం కావడం గమనార్హం.ఈ ఘటన కర్ణాటక సరిహద్దుల్లో జరిగినప్పటికీ, దీనికి సంబంధించిన ప్రాథమిక ఫిర్యాదు మహారాష్ట్రలోని నాసిక్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. కేసు తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT)రంగంలోకి దింపారు.ఇప్పటికే నాసిక్ పరిసర ప్రాంతాల్లో కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు హోంమంత్రి పరమేశ్వర ధృవీకరించారు.ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు విచారణను వేగవంతం చేశారు” అని పరమేశ్వర స్పష్టం చేశారు.అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ భారీ సొమ్ము ఎవరిది అనే చర్చ మొదలైంది.రాబోయే ఎన్నికల ఖర్చుల కోసం కాంగ్రెస్ పార్టీయే ఈ రూ. 400 కోట్లను తరలిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా కొట్టిపారేసింది. కంటైనర్ ప్రయాణించిన గుజరాత్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది బీజేపీయేనని, కాబట్టి ఆ డబ్బు ఎవరిదో వారికే తెలియాలని ఎద్దేవా చేశారు.
అసలు ఆ డబ్బు ఎవరిది?
ప్రస్తుతానికి ఆ 400 కోట్లు బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించినవా? లేక ప్రైవేట్ వ్యక్తులవా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మహారాష్ట్ర SIT విచారణ పూర్తయితే తప్ప ఈ మిస్టరీ వీడేలా లేదు.రూ. 400 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అన్న కోణంలో మహారాష్ట్ర పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఎన్నికల నిధుల తరలింపుపై రాజకీయ ఆరోపణలకు తావులేదని స్పష్టం చేస్తున్నారు.అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఇంత పెద్ద మొత్తంలో దోపిడీ జరగడం భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. పోలీసులు అనుమానితులను విచారిస్తున్న నేపథ్యంలో, త్వరలోనే ఈ భారీ దోపిడీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.
…………………………………….
