* బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ షురూ : మహేశ్ కుమార్ గౌడ్
* ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్ విజయం : బండి సంజయ్ సెటైర్
* మీ స్థాయికి ఇది తగునా : కేటీఆర్ కౌంటర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎమ్మెల్సీ కవిత(MLS KAVITHA)కు బెయిలు రావడంతో బీఆర్ ఎస్(BRS) శ్రేణులు ఓపక్క సంబరాలు చేసుకుంటుంటే.. మరోపక్క విపక్షాలు కౌంటర్లు ఇస్తున్నాయి. బెయిలు వెనుక రాజకీయ కోణాన్ని ఆపాదిస్తున్నారు. కవితకు బెయిల్ వస్తుందన్న విషయం ఊహించిందేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్(MAHESH KUMAR GOUD) చెప్పారు. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ప్రారంభమవుతుందని, అదొక్కటే ఇప్పుడు మిగిలిందని అన్నారు. బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) కుమ్మక్కు కావడంతోనే ఆమెకు బెయిల్ వచ్చిందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ను బీఆర్ఎస్, బీజేపీ దెబ్బతీయాలని చూశాయని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని చెప్పారు. హరీశ్ రావు, కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ తిరిగి వేడుకున్నారని అన్నారు. బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ల మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని మహేశ్ కుమార్ గౌడ్ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి, న్యాయవాదులకు అభినందనలు : బండి
లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించినందుకు…కాంగ్రెస్ పార్టీకి, న్యాయవాదులకు అభినందనలంటూ కేంద్రమంత్రి బండి సంజయ్(BANDI SANJAY) సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. కవిత బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటికీ విజయంగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళ్లారని…కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడికి మద్దతు ఇవ్వడంలో… కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురత సాధించారని బండి సంజయ్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ ఎస్ విజయంగా వర్ణించారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్(KTR STRONG COUNTER) ఇచ్చారు. ‘‘ మీరు ఒక కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రిగా ఉండి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై నిందలు వేస్తున్నారు!!. అది మీ హోదాకు తగదు. మీ స్థానానికి తగినది కాదు’’ అని కేటీఆర్ విమర్శించారు. కాగా, బండి సంజయ్, మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలపై బీఆర్ ఎస్ ఫైర్ అవుతోంది. కోర్టు ధిక్కరణ కింద వారిపై చట్టపరంగా చర్యలకు కోరతామని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.
—————————