* త్వరలో బెయిలంటూ కొద్దిరోజుల ముందు కేటీఆర్ ప్రకటన
* ఈసారీ కూడా నిరాశే..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (Ex. Cm. Kcr) కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) కు ఈసారి కూడా బెయిలు దక్కలేదు. కొద్దిరోజుల క్రితం ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్(Ktr) మాట్లాడుతూ కవితకు బెయిలు ఏర్పాట్లు జరుగుతున్నాయని త్వరలోనే బయటకు వస్తారని తెలిపారు. ఆమె ఆరోగ్యం క్షీణించిందని 11 కేజీల బరువు తగ్గారని వెల్లడించారు. ఈనేపథ్యంలో ఈరోజు జరిగిన విచారణతో బెయిలు వస్తుందని బీఆర్ ఎస్ శ్రేణులు భావించారు. కానీ.. కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు(Suprim Court) వాయిదా వేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నెల 20న విచారణ చేపడతామని తెలిపింది. వాదనల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారించిన సుప్రీం ఈమేరకు తీర్పు వెలువరించింది.
హైకోర్టు నుంచి సుప్రీంకు వెళ్లి పోరాటం..
తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు (Delhi Hicourt) జూలై 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(క్రిమినల్) దాఖలు చేశారు. మద్యం పాలసీ కేసులో కవిత సాక్ష్యాలను ధ్వంసం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న దర్యాప్తు సంస్థల వాదనలతో ఢిల్లీ హైకోర్టు ఏకీభవించింది. ‘‘ఢిల్లీ మద్యం పాలసీ కేసులో దర్యాప్తు సంస్థలు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో 50 మందిని నిందితులుగా పేర్కొన్నాయి. అందులో కవిత మాత్రమే మహిళ. మహిళలకు కొన్ని ప్రత్యేక వెసులుబాట్లను చట్టాలు కల్పించాయి. మహిళా చట్టాలను పరిగణనలోకి తీసుకుని కవితకు బెయిల్ ఇవ్వండి. కవిత విషయంలో దర్యాప్తు సంస్థలు మొదటి నుంచీ చట్టాలను ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. అరెస్టు సమయంలో కనీస నిబంధనలు పాటించలేదు. మహిళలకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయి. వాటి కింద కవితకు బెయిల్ ఇవ్వాలి’’ అని కవిత (Kavitha)తరఫున సీనియర్ న్యాయవాదులు వినిపించిన వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇరుపక్షాల సుధీర్ఘ వాదనల తర్వాత కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ కొట్టేశారు. ఇప్పుడు కవిత అవే అంశాల ఆధారంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం మరోసారి ఈనెల20న విచారణ చేపడతామని తెలిపింది. దీంతో అప్పటి వరకు కవిత జైల్లో ఉండాల్సిందే. దీంతో ఈసారి తమ నాయకురాలికి తప్పనిసరిగా బెయిల్(Bail) వస్తుందని భావించిన బీఆర్ఎస్(BRS) వర్గాల ఆశ నిరాశే అయింది.
—————————————–