* బాధ పడకండి నీళ్ళు, కరెంట్, రైతు భరోసా సాధించుకుందాం.
* దరావత్ తండాలో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్
* చేతికందే సమయంలో నేల పాలయినాయి
* గోడును వెళ్ళ బోసుకున్న రైతులు
* కొడుకు పెళ్ళి చేయలేకపోతున్నానని విలపించిన అంగోత్ సత్తెమ్మ
* ఐదు లక్షల సాయం ప్రకటించిన కేసీఆర్
* కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన అధికారులు
ఆకేరు న్యూస్ , వరంగల్ : కేసీఆర్ ( KCR ) పొలంబాట పట్టాడు. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ మొదటి సారి జనంలోకి వచ్చారు. నీటి ఎద్దడితో యాసంగి పంటలు ఎండిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైతులను పరామర్శించే కార్యక్రమం చేపట్టారు. మొదటి విడతగా జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే జనగామ జిల్లా దేవరుప్పుల మండలం దరావత్ తండా ( లో ఎండిన పంటలను పరిశీలించారు. రహదారి పక్కనే ఉన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. పంట ఎందుకు ఎండింది..? సాగు నీరు అందడం లేదా..? గత యాసంగి పంటలకు ఏ విదంగా సాగు నీరు అందింది. ఇపుడెందుకు అందడం లేదు.. అన్న విషయాలు రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటలు ఎండడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ధైర్యంగా ఉండాలని పోరాడి మన నీళ్లను మనం సాధించుకుందామని.. 24 గంటల కరెంటును సాధించుకుందామని.. రైతు రుణమాఫీని, రైతు బంధు పోరాడి సాధించుకుందామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండి రైతన్న కన్నీళ్లు పెడుతుంటే.. ఏమాత్రం స్పందించకుండా సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy )ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని కేసీఆర్ విమర్శించారు. ఇదీ కర్కశ ప్రభుత్వం రైతుల కష్టాలు కనీసం చీమ కుట్టినట్టయినా కావడం లేదు. దుర్మార్గపు సీఎం రేవంత్ రెడ్డి రైతుల గోసను పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ రాజకీయాల పేరుతో చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు.
* రైతు కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం
పొలం ఎండిపోయింది, కుమారుడి పెళ్లి పెట్టుకున్నాం. నాలుగు బోర్లు వేసినా చుక్క నీరు రాక నాలుగు ఎకరాల పంట ఎందుకు పనికి రాకుండా పోయిందని ఆంగోతు సత్తెమ్మ రైతు కేసీఆర్ ముందు కన్నీటి పర్యంతమయింది. బోర్లు వేసి నీళ్లు రాక పంటలు ఎండిపోయి దాదాపు నాలుగైదు లక్షల అప్పు అయిందని ఆమె విలపించారు. పెళ్ళి చేయడానికి ఇపుడు డబ్బలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.దీంతో స్పందించిన కేసీఆర్ సత్తెమ్మ కుమారుని వివాహ ఖర్చు నిమిత్తం ఐదు లక్షల రూపాయలు అందిస్తామని అక్కడికక్కడే ప్రకటించారు.
అనంతరం ఆయన సూర్యాపేట జిల్లాలో పంట నష్టాన్ని పరిశీలించేందుకు వెళ్ళారు. సూర్యాపేటలో మద్యాహ్న భోజనం అనంతరం 3 గంటలకు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం నాగార్జున సాగర్ నియోజకవర్గం లోని నిడమనూరుకు చేరుకుంటారు. అక్కడ ఎండి పోయిన పంటలను పరిశీలిస్తారు. అనంతరం హైదరాబాద్కు చేరుకుంటారు. కేసీఆర్ తో పాటు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ రవిందర్ రావు , స్థానిక నేతలు పాల్గొన్నారు.
* కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన అధికారులు
కేసీఆర్ పొలంబాట కార్యక్రమంలో భాగంగా ప్రయాణిస్తున్న బస్సును అధికారులు తనిఖీ చేశారు. సూర్యాపేట జిల్లా ఈదుల పర్రె తండా చెక్ పోస్ట్ వద్ద వాహనాన్ని ఆపి తనిఖీ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అన్ని వాహనాలను తనిఖీ చేసినట్టే మాజీ సీఎం కేసీఆర్ వాహనాన్ని కూడా తనిఖీ చేశామని అధికారులు చెప్పారు.ఇందులో ప్రత్యేకత ఏమి లేదన్నారు.
——————————————————–