

* కూతురు మేయర్ విజయలక్ష్మీ తో కలిసి కాంగ్రెస్లో చేరేందుకు ఏర్పాట్లు
* ఈ నెల 30 న కాంగ్రెస్లో చేరనున్న కేశవరావు, విజయలక్ష్మీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ , రాజ్యసభ సభ్యుడు కేశవరావు పార్టీని వీడుతున్నారు. ఈ రోజు మద్యాహ్నం కేసీఆర్ను ఎరవల్లి ఫామ్ హౌజ్లో కలుసుకున్నారని తెలిసింది. పార్టీ వీడుతున్నానన్న సమాచారం ఇచ్చేందుకే కేశవరావు ఆయనను కలిశారు. పదేండ్లు అధికారం అనుభవించి ఇపుడు పార్టీ మారడం సరియైంది కాదని కేసీఆర్ వారించినట్లు సమాచారం. అయినప్పటికీ తాను మనసు మార్చుకునేది లేదంటూ ఇతర కారణాలను చెప్పేందుకు కేకే ప్రయత్నం చేయడంతో సాకులు చెప్పొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. 2014లో బీఆర్ ఎస్ పార్టీలో చేరిన కేశవరావు రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది. కూతురు విజయలక్ష్మీకి మేయర్గా, కొడుకుకు నామినేటెడ్ పదవి ఇచ్చారని అయినప్పటికీ కేకే పార్టీ మారడం సరియైంది కాదని బీఆర్ ఎస్ నేతలు అంటున్నారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ కేకే నివాసానికి వచ్చారు. అప్పటి నుంచే కేకే , ఆయన కూతురు మేయర్ విజయలక్ష్మీ కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారన్నప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఈ నెల 30న కేశవరావు, మేయర్ విజయలక్ష్మీ కాంగ్రెస్లో చేరుతున్నామని ప్రకటించారు.
————————————————–
