
* స్పీకర్ విశేషాధికారాలను కోర్టులు హరించలేవన్న న్యాయవాది
* కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అన్న ధర్మాసనం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ఎస్ నుంచి గెలిచి, పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు(Supreme Court)లోవాదనలు జరిగాయి. బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిగింది. గత విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈరోజు ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి(Mukul Rohathgi), అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. స్పీకర్ కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని అన్నారు. స్పీకర్ ఒకసారి నిర్ణయం తీసుకున్నాకే జ్యుడీషియల్ సమీక్షకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. కాలపరిమితితో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు కోర్టులు చెప్పడం భావ్యం కాదని అన్నారు. ఒకవేళ సూచనలను సూచిస్తే స్వీకరించాలా, వద్దా అనేది స్పీకర్ నిర్ణయమే అని వాదించారు. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయలేదని అన్నారు.
స్పీకర్ కు చెప్పలేమా?
దీనిపై జస్టిస్ గవాయ్ (Justice Gavay)జోక్యం చేసుకున్నారు. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని అన్నారు. నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఉండాల్సిందేనా అని ప్రశ్నించారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు చెప్పలేమా అని అని ప్రశ్నించారు. స్పీకర్ కు సూచనలు చేయడమో, ఆదేశించడమో కోర్టులు చేయకూడదా అన్నారు. ఫిరాయింపులపై పిటీషనర్ల ఇష్టానుసారం స్పీకర్ వ్యవహరించలేరని.. 18.03.2024న పిటీషనర్లు స్పీకర్‌కు విజ్ణప్తి చేశారని రోహత్గి తెలిపారు. 16.01.2025న 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారని.. స్పీకర్ తన విధులను నిర్వర్తిస్తున్నారని వాదించారు. స్పీకర్‌పై నమ్మకం లేక రిట్ల పైన రిట్లు దాఖలు చేయడం ఎందుకు?…స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకూ ఎందుకు పిటీషనర్లు ఆగరని సీనియర్ న్యాయవాది ప్రశ్నించారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వారంలోనే కోర్టులో పిటిషన్ వేశారని కోర్టుకు తెలిపారు. ఒకదాని తర్వాత మరొక రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారన్నారు. కనీసం ఆలోచించే అవకాశం కూడా లేకుండా కోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేస్తూ వచ్చారన్నారు. సింగిల్ జడ్జి బెంచ్ నాలుగు వారాల్లో షెడ్యూల్ చేయాలని చెప్పిందని.. ఆ ఆదేశాలను డివిజన్ బెంచ్ కొట్టేసిందని తెలిపారు. రాణా కేసుతో ఈ కేసును ముడి పెడుతున్నారని.. అది ఏమాత్రం సమంజసం కాదని.. రాణా కేసు పూర్తిగా భిన్నమైన వ్యవహారమని ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
……………………………..