Khairatabad Ganesh
* మహా నిమజ్జనం పూర్తి..
* క్రేన్ 4 వద్ద వీడ్కోలు
Khairatabad Ganesh| ఆకేరు న్యూస్, హైదరాబాద్: కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో భక్తిశ్రద్ధలతో కొనసాగిన వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఖైరతాబాద్ శ్రీ సప్తముఖ సంకటహర మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవం వైభవంగా ముగిసింది. వేలాది మంది భక్తుల జయజయధ్వానాలు, గణపతి బప్పా మోరియా నినాదాల మధ్య 69 అడుగుల మహాగణపతి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం అయ్యారు.
* క్రేన్ 4 వద్ద ప్రత్యేక పూజలు
శోభాయాత్ర ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ పోలీసులు, అధికారులు సమన్వయంతో మహాగణపతిని సచివాలయం మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్దకు వేగంగా తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12.40 గంటలకు గణపతి అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఉత్సవ సమితి సభ్యులు, పూజారులు ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించారు. వెల్డింగ్ పనులు పూర్తి చేసి విగ్రహానికి అమర్చిన రాడ్లను తొలగించారు. మధ్యాహ్నం 2.05 గంటలకు టస్కర్ వాహనం నుంచి క్రేన్ సహాయంతో గణపతిని మెల్లగా పైకి తీశారు. అనంతరం భారీ క్రేన్ సాయంతో మధ్యాహ్నం 2.39 గంటల నుంచి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన ప్రక్రియ చేపట్టారు.
* భక్తులతో కిక్కిరిసిన ట్యాంక్‌బండ్
మహాగణపతి చివరి దర్శనం కోసం ట్యాంక్‌బండ్ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గణపతి నిమజ్జనం సందర్భంగా భక్తులు భావోద్వేగానికి గురయ్యారు. 12 రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్ గణపయ్యకు ఘనంగా వీడ్కోలు పలికారు.
* సమన్వయంతో ప్రశాంతంగా..
గతంతో పోలిస్తే ఈ ఏడాది నిమజ్జన ప్రక్రియను వేగంగా, ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ నగర పోలీసులు, ట్రాఫిక్ విభాగం, విద్యుత్ శాఖ, అగ్నిమాపక సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శోభాయాత్రను విజయవంతంగా నిర్వహించారు. మహాగణపతి నిమజ్జనం పూర్తికావడంతో ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్‌ను సాధారణ స్థితికి తీసుకురావడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. మిగతా వినాయక విగ్రహాల నిమజ్జనానికి మార్గాన్ని సుగమం చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
