* అడుగు నుంచి 70 అడుగుల ఎత్తుకు..
* ఈసారి సప్తముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు దర్శనం
* తొలి పూజలు చేసిన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి
* మధ్యాహ్నం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పూజలు
* దేశం దృష్టిని ఆకర్షించేలా ఖైరతాబాద్ గణేష్ : ముఖ్యమంత్రి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఖైరతాబాద్ బడా గణేష్.. వినాయక చవితి అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆ పేరుకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ సారి ఏ రూపంలో, ఎన్ని అడుగుల్లో దర్శనం ఇస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పండుగకు మూడు నెలల ముందు నుంచే మహా గణపతి రూపకల్పనకు ప్రణాళికలు మొదలవుతాయి. కర్రపూజతో బొజ్జ గణపయ్య నిర్మాణానికి అంకురార్పణ జరుగుతుంది. ఖైరతాబాద్ ప్రాంగణంలో గణపతిని ప్రతిష్టించి, 70 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహా శక్తి గణపతిగా శనివారం నుంచి భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 1954 నుంచి 2024 వరకూ దేశం దృష్టిని ఆకర్షించే విధంగా వినాయక చవితిని నిర్వహించడం ఆసక్తికర పరిణామమని రేవంత్ అన్నారు. ఖైరతాబాద్ వినాయకుడు దేశంలో గొప్ప గుర్తింపు పొందడం మనకు గర్వకారణమన్నారు.
1954 నుంచి నేటి వరకూ..
ఖైరతాబాద్ లో తొలిసారి 1954లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. కేవలం అడుగు ఎత్తులో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ తర్వత ప్రతీ ఏటా ఒక్కో అడుగూ పెంచుతూ వస్తున్నారు. ఇప్పుడు 70 ఏళ్లు అయిన సందర్భంగా 70 అడుగుల ఎత్తులో పర్యావరణ హిత గణపతిగా శిల్పి రాజేంద్రన్ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. 70 అడుగులు భారీ వినాయకుడి కోసం 1000 బ్యాగుల మట్టి, 18 టన్నుల ఇనుము, 2వేల మీటర్ల కాటన్ క్లాత్, మరో 2 వేల మీటర్ల జూట్క్లాత్ ను ఉపయోగించారు. దాదాపు 150 మంది కళాకారులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేశారు. నిర్జల ఏకాదశి నాడు ఖైరతాబాద్ మహాగణపతి పనులు మొదలుపెట్టి 78 రోజులపాటు శ్రమించి, బొజ్జ గణపయ్యను తీర్చిదిద్దారు. 70 అడుగుల ఎత్తులో, 28 అడుగుల వెడప్పులో తయారు చేశారు. మొత్తం బరువు 40 టన్నులుగా పేర్కొంటున్నారు. విగ్రహ తయారీకి కోటి రూపాయలు ఖర్చు అయిందని నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రత్యేక రూపం..
ఏటా గణపతి విగ్రహ రూపం ప్రత్యేకంగా ఉండేలా నిర్వాహకులు శ్రద్ధ వహిస్తారు. ఈ సారి సప్త ముఖాలతో పాటు, ఓ వైపు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నారు. మరోవైపు సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి, మధ్య గణపతిని తీర్చిదిద్దారు. ఈసారి ప్రత్యేకంగా అయోధ్య బాలరాముడిని గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తులో ఉంచారు. ఈసారి మరో విశేషం ఏంటంటే.. తొలిసారిగా ‘ఆగమన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక యువకులు, భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. తొలిరోజు గణపతిని దాదాపు 3 లక్షల మంది దర్శించుకున్నారు. కాగా, గతేడాది బడా గణేష్ని దాదాపు 22 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ ఏడాది 30 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని ఉత్సవ కమిటీ భావిస్తోంది.
ముఖ్యమంత్రి తొలిపూజలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు గణపతికి తొలిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 70 ఏళ్లుగా నిష్ఠతో, భక్తి శ్రద్ధలతోఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశం దృష్టిని ఆకర్షించేలా ఖైరతాబాద్ గణపతి ఖ్యాతి పొందుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉత్సవ కమిటీల సమస్యలను తెలుసుకుందని తెలిపారు. మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ నగరంలో లక్షా 40వేల విగ్రహాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. అకాల వర్షాలతో పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది. అందరి పూజలు, దేవుడి ఆశీస్సులతో వరదల నుంచి బయటపడ్డామన్నారు. స్వర్గీయ పీజేఆర్ ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులకు తెలిపారు. ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నానని, ఏటా ఉత్సవ కమిటీ ఎప్పుడు ఆహ్వానించినా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకుంటానని రేవంత్ తెలిపారు. కాగా, మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా గణపతిని దర్శించుకున్నారు.