డబ్బు కోసం కట్టుకున్న వాడినే కడతేర్చిన కిరాతక భార్య…
ఖమ్మంలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త హత్య!
66 లక్షల బీమా సొమ్ముపై కన్నేసిన భార్య..
పథకం ప్రకారం భర్తను చంపించిన వైనం!
ఆకేరు న్యూస్, ఖమ్మం:
డబ్బు పిచ్చితో కనికరం లేకుండా కట్టుకున్న భర్తనే కడతేర్చిన ఓ భార్య ఉదంతం ఖమ్మం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. బీమా సొమ్ము కోసం ఆమె వేసిన స్కెచ్, అందుకు సహకరించిన ముఠా ఆగడాలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ప్రాణం కంటే పైసలే మిన్న అని భావించిన సదరు మహిళ కన్నతల్లి, భార్య అనే బంధాలను మరిచిపోయి ఈ ఘాతుకానికి పాల్పడింది.
ఖమ్మం నగరానికి చెందిన చాగంటి రవి (52) అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే కొంతకాలంగా రవి మద్యానికి బానిసై అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భర్త ఆరోగ్యం క్షీణించడాన్ని గమనించిన అతడి భార్య ప్రశాంతిలో జాలి కలగాల్సింది పోయి, కుట్ర ఆలోచనలు మొదలయ్యాయి. తన భర్త ఎలాగో చనిపోతాడు కదా, ఆ చావు ద్వారా తనకు ఆర్థిక లాభం చేకూరాలని దుష్ట ఆలోచన చేసింది. ఈ క్రమంలోనే గతేడాది జూలై నెలలో తన బంధువు శ్రీనివాస్ సహాయంతో రవి పేరు మీద ఏకంగా 66 లక్షల రూపాయల భారీ ఇన్సూరెన్స్ పాలసీని చేయించింది.
భర్త త్వరగా చనిపోతే ఆ డబ్బంతా తనకే దక్కుతుందని ఆమె ఆశపడింది. కానీ కాలక్రమేణా రవి ఆరోగ్యం మెరుగుపడటం మొదలైంది. ఇది చూసి సంతోషించాల్సిన ప్రశాంతి, బీమా డబ్బులు ఎక్కడ చేజారిపోతాయోనన్న ఆందోళనతో రగిలిపోయింది. కాలం గడుస్తున్నా భర్త చనిపోకపోవడంతో, అతడిని తానే అంతమొందించాలని నిశ్చయించుకుంది. ఈ దారుణానికి సహకరించేందుకు శ్రీనివాస్ తో పాటు జోగి రాజ్‌కుమార్, జోగి వెంకటేష్, జోగి రాంబాబు అనే వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకుంది. భర్తను చంపితే వచ్చే బీమా సొమ్ములో సగం వాటా ఇస్తానని వారికి ఆశ చూపింది.
పథకం ప్రకారం ఈ నెల 2వ తేదీన రవిని పథకం ప్రకారం బయటకు తీసుకెళ్లారు. అతడికి మద్యం మత్తు ఎక్కించి, స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం వీవీ పాలెం శివారు ప్రాంతానికి తీసుకెళ్లి, అక్కడ కారుతో బలంగా ఢీకొట్టారు. దీన్ని ఒక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి బీమా క్లెయిమ్ చేసుకోవాలని భావించారు. అయితే ఘటనా స్థలంలో పరిస్థితులు, మృతుడి కుటుంబ సభ్యుల అనుమానాల నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు.
ఖమ్మం పోలీసులు సాంకేతిక ఆధారాలను విశ్లేషించగా, ఈ కేసులో ఊహించని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ తిరిగిన వాహనాల వివరాలు, ఫోన్ కాల్ డేటా ఆధారంగా ప్రశాంతి కుట్రను పోలీసులు బట్టబయలు చేశారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించడంతో, పోలీసులు ప్రశాంతితో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేవలం కాసుల కక్కుర్తి కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
