* రఘురాంరెడ్డి కోసం ఇద్దరు వియ్యంకుల తపన
* సీనీ నటుడు వెంకటేశ్ ప్రచారం
* మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యూహ రచన
ఆకేరు న్యూస్ ,ఖమ్మం : ఎన్నికల ప్రచారాల్లో ఆయా పార్టీల అగ్రనేతలే కాదు, అభ్యర్థుల కుటుంబసభ్యులు కూడా చురుగ్గా పాల్గొనడం సహజం. భర్తలు, భార్యలు, కొడుకులు, తండ్రులు… ఇలా ఏ పాత్రలో ఉన్నా.. వారు తమ వారి విజయం కోసం ఎన్నికల్లో చెమటోడ్చుతుంటారు. తాజాగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈ తంతు రిపీట్ అవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి… ఖమ్మంలో మాత్రం కాస్త భిన్నంగా ఆకట్టుకుంటోంది. ఈ డిఫెరెంటు కథ ఏమిటో తెలుసుకోవాలంటే ఖమ్మం కుటుంబ కథాచిత్రమ్లోకి వెళ్లాలి…
రామ సహాయం ఫ్యామిలీ
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి బరిలో వున్నారు. ఈయన ఉన్నత విద్యావంతుడు, వ్యాపారవేత్త అయినప్పటికీ రాజకీయాలకు మాత్రం కొత్త. తాను ఖమ్మం జిల్లా వాసినేనని చెప్పుకుంటున్నా.. ఆయన ఖమ్మంలో రాజకీయా కార్యకలాపాలు చేపట్టిందీ లేదు.. పదవులను అధిష్టించిందీ లేదు. ఆయన తండ్రి సురేందర్‌రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికై అక్కడి జిల్లా ప్రజలకు చిరపరిచితులుగా వున్నారు. అందుకే రామసహాయం పేరు వినగానే ఉమ్మడి వరంగల్ జిల్లానే స్ఫురణకు వస్తుంది. తన తండ్రికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్నా.. రఘురాంరెడ్డి వరంగల్ జిల్లాలో కూడా రాజకీయ పునాదులు వేసుకోలేకపోయారు. ఆయన ఎక్కువగా హైదరాబాద్‌కే పరిమితం అయినట్టు కనిపిస్తుంది. అసలు రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి కనబరచలేదు. అనూహ్యంగా ఖమ్మం కాంగ్రెస్ టికెట్ రఘురాం రెడ్డికి దక్కింది.. ఖమ్మం జిల్లా ప్రజలు ఆయనను స్థానికేతరుడిగానే చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో ఖమ్మం నుంచి తేళ్ల లక్ష్మీకాంతమ్మ, పీవీ రంగయ్యనాయుడు, నాదెండ్ల భాస్కర్‌రావు, రేణుకాచౌదరి వంటి వారు స్థానికేతరులుగా రంగంలోకి విజయం సాధించారు. అంటే ఖమ్మంలో స్థానికేతరులు బలమైన వ్యక్తులుగా బరిలోకి దిగితే గెలిచే అవకాశాలు ఉంటుందనేది ఖమ్మం జిల్లా ఎన్నికల చరిత్ర చెబుతున్న సత్యం.
వియ్యంకుల తపన
ప్రస్తుతం ఖమ్మం నుంచి బరిలోకి దిగిన రఘురాంరెడ్డి.. పార్టీ ఓటు బ్యాంకు రీత్యా బలమైన అభ్యర్థిగానే పరిగణించబడుతున్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒకచోట మిత్రపక్షమైన సీపీఐ ఎమ్మెల్యే ఉన్నారు . దీంతో రఘురాంరెడ్డి విజయం నల్లేరుమీద నడకగానే భావిస్తున్నారు. రఘురాంరెడ్డికి టికెట్ దక్కడంలో ఆయన వియ్యంకుడు, ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారనేది బహిరంగ సత్యం. టికెట్ ఖరారు నుంచే రఘురాంరెడ్డి ప్రచార బాధ్యతలను పొంగులేటి నెత్తికెత్తుకున్నారు. వియ్యంకుడిని వెంటేసుకొని ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన సతీమణి నందినికి టికెట్ ఇప్పించుకోవడంలో విఫలమైన డిప్యూటీ సీఎం భట్టి పెద్దగా కలిసిరాకున్నా.. పొంగులేటి మరో మంత్రి తుమ్మలను కలుపుకొని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అప్పుడప్పుడు ఖమ్మం మాజీ ఎంపీ రేణుకాచౌదరిని రప్పిస్తూ రక్తి కట్టిస్తున్నారు.
కమ్మ వర్సెస్ రెడ్డి ..
బరిలో ఉన్న నామా నాగేశ్వర్రావు (బీఆర్ఎస్), తాండ్ర వినోద్‌రావు(బీజేపీ)లు.. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి స్థానికేతరుడనే విషయాన్ని తరుచూ ఫోకస్ చేస్తున్నారు ఖమ్మం అంటేనే కమ్మ సామాజిక వర్గం ఇలాకాగా భావిస్తారు. రాజకీయాల్లో చాలా కాలంగా కమ్మ సామాజిక వర్గ నేతలే రాజకీయాలను శాసిస్తున్నారు. ఇప్పడు అందుకు భిన్నంగా పొంగులేటితో మొదలైన రెడ్డి సామాజిక వర్గ పెత్తనం మొదలైంది. ఇపుడు మరింత ముందడుగు వేసి మరో బలమైన రెడ్డి సామాజికి వర్గానికి చెందిన రఘురాం రెడ్డి ప్రవేశించారు. కమ్మ సామాజిక వర్గం మరో ఆధిపత్య సామాజిక వర్గానికి చెందిన రెడ్డి నాయకుడిని ఆదరిస్తారా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పొంగులేటి ముందుజాగ్రత్తగా అప్రమత్తమైనట్టు కనిపిస్తోంది. రాజకీయ నాయకులకే పరిమితం కాకుండా.. ప్రచారానికి సినీతారల తళుకులు అద్దడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన రఘురాంరెడ్డి పెద్ద వియ్యంకుడైన సినీ హీరో దగ్గుబాటి వెంకటేశ్‌ను రంగంలోకి దించుతున్నారు. దాదాపు ఐదు రోజుల పాటు ఖమ్మంలోనే మకాం పెట్టించి ఆయనతో ప్రచారం చేపట్టేందుకు ప్లాన్ రూపొందించారు. మే 7వ తేదీ నుంచి ఖమ్మంలో వెంకటేశ్ ప్రచారం నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. వెంకటేశ్ రానున్నారనే వార్తలతో ఖమ్మంలో అప్పుడే సందడి మొదలైంది. వెంకటేశ్ కుమార్తె, రఘురాంరెడ్డి పెద్ద కోడలూ అయిన ఆశ్రిత తండ్రి రాకకు ముందే ప్రచారంతో సందడి చేస్తున్నారు.
వెంకటేశ్ రంగ ప్రవేశం
రఘురాంరెడ్డికి వెంకటేశ్ , పొంగులేటి వియ్యంకులు . టికెట్ ఇప్పించిన పొంగులేటి.. ఇప్పుడు గెలుపు బాధ్యతను తోటి వియ్యంకుడు వెంకటేశ్‌కు షేర్ చేస్తున్నారన్నమాట. ఒకరు అగ్ర నాయకుడైతే, మరొకరు అగ్ర కథానాయకుడు.. ఇద్దరూ కలిసి రఘురాంరెడ్డి ఘన విజయానికి బాటలు వేస్తున్నారు. ఖమ్మంలో కమ్మ సామాజికవర్గానికి బలమైన పట్టు వుంది. పనిలో పనిగా ఆ వర్గాన్ని కూడా ఆకట్టుకోవడం వెంకటేశ్ రాకలో ఒక కోణమని భావిస్తున్నారు. మొత్తానికి తమ బిడ్డల్ని ఇంటి కోడళ్లు అయినందుకు రఘురాంరెడ్డి ఇద్దరు వియ్యంకులు కలిసి రఘురాం రెడ్డిని విజయ తీరాలకు చేర్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. విలక్షణ రాజకీయాలకు కేరాఫ్ అయిన ఖమ్మంలో ఇప్పుడు పొలిటికల్ సినిమా ఆసక్తిరేపుతోంది.
——————————