* ఒక్కో కిడ్నీకి 20 లక్షలు ఇస్తామని ఎర
* ఆపరేషన్ తర్వాత 6 లక్షలే చేతుల్లోకి
* 40 మంది యువకులకు కిడ్నీ మార్పిడి
* కేరళ యువకుడి మృతితో వెలుగులోకి దందా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పేదలకు డబ్బు ఆశచూపి కిడ్నీలను కాజేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న డబ్బున్న బడాబాబులకు వాటిని అమరుస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారు. ఈతంతులో పేద యువకులు బలవుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మరో కిడ్నీ రాకెట్ దందా కేరళలో వెలుగుచూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. హైదరాబాద్కు చెందిన ఓ డాక్టర్ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలకు చెందిన యువకులకు డబ్బు ఆశచూపేవాడు. ఓ కిడ్నీ దానం చేస్తే రూ. 20 లక్షలు వస్తాయని నమ్మించేవాడు. వాటిని అనారోగ్యంతో బాధపడుతున్న డబ్బున్న వాళ్లకు 50 లక్షలకు బేరం కుదుర్చుకునేవాడు. ముందుకు వచ్చిన యువకులను నుంచి కిడ్నీలను సేకరించేవాడు. ఆపరేషన్ తర్వాత వారికి 6 లక్షలే చేతులో పెట్టేవాడు. ఇలా సుమారు 40 మంది యువకుల నుంచి కిడ్నీ మార్పిడి చేసినట్లు తెలిసింది. యువకులను ఇరాన్ తీసుకెళ్లి ఈ ముఠా కిడ్నీ మార్పిడి చేసేది. డబ్బుకు ఆశపడి కేరళకు చెందిన ఓ యువకుడు కిడ్నీ ఇచ్చాడు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. దీనిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో హైదరాబాద్కు చెందిన ఓ డాక్టర్ సూత్రధారి అని తెలిసింది. దీంతో అతడి కోసం గాలింపు చేపడుతున్నారు.
———