కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
* కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: దేశ భవిష్యత్తుకు యువతే ప్రధాన బలమని, విలువైన యువశక్తిని మాదకద్రవ్యాల (Drugs) మహమ్మారి నుంచి కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత భారతదేశం (Drug-Free India) లక్ష్యంతో ఆయన చేపట్టిన మూడు రోజుల ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ (Hyderabad Walks for Nasha Mukt Bharat) పాదయాత్ర బుధవారం అంబర్‌పేటలో ప్రారంభమైంది. సినీ నటుడు వెంకటేష్ జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ జనాభాలో 25 శాతానికి పైగా విద్యార్థులే ఉన్నారని, వారిని మత్తుపదార్థాల బారిన పడకుండా రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలోనూ మత్తుపదార్థాలను విద్యార్థులకు అలవాటు చేస్తున్న డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలలు, కళాశాలలు, బస్తీలను లక్ష్యంగా చేసుకుని మత్తుపదార్థాల వ్యాపారం చేస్తున్న వారిని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు.
వికసిత్ భారత్ (Viksit Bharat) లక్ష్యాన్ని సాధించాలంటే విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలన్నీ కలిసికట్టుగా డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు మాట్లాడుతూ.. ‘నషా ముక్త్ భారత్’ ఉద్యమానికి పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. శత్రు దేశాలు, దేశద్రోహ శక్తులు మాదకద్రవ్యాలను ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని, చదువు పేరుతో వారిపై అతిగా ఒత్తిడి చేయవద్దని సూచించారు. డ్రగ్స్ అక్రమ వ్యాపారాలపై ఈగల్ ఫోర్స్ (EAGLE Force) కఠినంగా వ్యవహరిస్తోందని, ఈ పోరాటానికి పౌర సమాజం కూడా సహకరించాలని కోరారు.
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. దేశాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలంటే ముందుగా తెలంగాణను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అన్నారు. విద్యాసంస్థల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
యువతే దేశానికి అతిపెద్ద బలం
సినీ నటుడు వెంకటేష్ మాట్లాడుతూ.. భారతదేశానికి యువతే అతిపెద్ద బలమని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని యువత తమ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ‘డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి’ (Say No to Drugs, Say Yes to Life) అంటూ యువతకు సందేశమిచ్చారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేపడుతున్న డ్రగ్స్ రహిత భారత్ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. జీవితం ఎంతో విలువైనదని, స్నేహితుల ఒత్తిడికి లొంగకుండా మత్తుపదార్థాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని యువతకు వెంకటేష్ సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

