ఆకేరు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వేళ ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ అనంతరం అత్యంత భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌కు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు గల్లంతు కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్నికలు ముగిసిన తర్వాత 47వ డివిజన్‌కు చెందిన 156వ పోలింగ్ బూత్ నుండి సుమారు 10 బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌కు చేరాల్సి ఉంది. అయితే, పాత పాల్వంచ పరిధిలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి బ్యాలెట్ బాక్సులను తరలిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు గుర్తించారు. అతడిని అడ్డుకుని ప్రశ్నించగా, సదరు వ్యక్తి సరియైన సమాధానాలు చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు ఆ వ్యక్తిని, బ్యాలెట్ బాక్సును పట్టుకుని పాల్వంచ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ విషయం తెలియగానే భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు హుటాహుటిన పాల్వంచ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఎన్నికల విధుల్లో ఇంతటి నిర్లక్ష్యం ఎలా జరుగుతుందని పోలీసులను నిలదీశారు. పోలీసులు ప్రస్తుతం ఒక బ్యాలెట్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నప్పటికీ, మిగిలిన బాక్సుల ఆచూకీపై స్పష్టత రాకపోవడం గమనార్హం. “గల్లంతైన 10 బ్యాలెట్ బాక్సులు ఎక్కడ ఉన్నాయో తేలే వరకు, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు పోలీస్ స్టేషన్ వదిలి కదిలేది లేదు” అంటూ రేగా కాంతారావు అక్కడే బైఠాయించారు. బ్యాలెట్ బాక్సుల గల్లంతు వెనుక అధికార కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందని విపక్షాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల సామాగ్రిని ఎన్నికల సిబ్బంది, పోలీసు భద్రత మధ్య తరలించాలి. కానీ ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో బ్యాలెట్ బాక్సులు దొరకడంపై ఓటర్లలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పాల్వంచ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పోలీసులు ఈ ఘటనపై ఎటువంటి అధికారిక ప్రకటన చేస్తారో వేచి చూడాలి.
