* ఏనాడు సెక్రటేరియట్ మొఖం చూడలేదు
* దేవరుప్పులకు పథకం ప్రకారమే వెళ్ళారు
* కాళేశ్వరం బీఆర్ ఎస్ కు ఏటీఎంగా మారింది
* కేసీఆర్ కొంగ జపం చేస్తున్నాడు
ఆకేరు న్యూస్ , వరంగల్ : కుంభకర్ణుడు నిద్రలేచినట్టు మాజీ సీఎం కేసీఆర్ ఇన్నాళ్ళకు లేచాడు. ఆయన పాలనా కాలంలో ఏనాడు సెక్రటేరియట్ మొఖం చూడలేదు.. తెలంగాణ ప్రజల దెబ్బకు దిమ్మ తిరిగి కేసీఆర్ రైతుల పేరుతో పల్లె బాట పట్టిండని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎద్దేవా చేశారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో రైతులు పడే కష్టాలకు బీఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ చేసిన పాపాలే కారణం. తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడన్నారు. లక్ష కోట్ల తో నిర్మించారని చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారింది. ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. 80 వేల పుస్తకాలు చదివానని చెబుతున్న కేసీఆర్ ఇంజనీర్లకు సైతం ఆర్థంకాని డిజైన్తో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారన్నారు. ఆ రోజే కాపర్ డాం కడితే రైతులకు ఈ ఇబ్బంది ఉండేది కాదు.
* కేసీఆర్ -కొంగ జపం
కేసీఆర్ రైతుల పేరుతో కొంగ జపం చేస్తున్నారు. చట్ట సభలకు రాకుండా ప్రజల సమస్యలు మాట్లాడకుండా మొఖం చాటేస్తున్నారన్నారు. రైతుల పేరుతో రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్నితరుముతాం.. ఎండగడతాం అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ఒక్క రైతుబంధు ఇస్తున్నానన్న సాకుతో రైతులకు వచ్చే ఇతర రకాల సబ్సిడిని ఎత్తి వేశారన్నారు. రైతు బంధు పేరుతో వందల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడ్డారన్నారు. మా నాయకుడు రేవంత్ రెడ్డిని ముఠా మేస్త్రీ అంటున్నారు. నిజమే .. మీరు గతంలో చేసిన అనేక పాపాలను, లోపాలను సరి చేస్తున్నారు. దేవరుప్పుల కు కేసీఆర్ను పథకం ప్రకారం తీసుకెళ్ళారు. సాగునీరు సౌకర్యం లేని దేవరుప్పుల ప్రాంతానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలని ప్రయత్నించారన్నారు.
ఆ ప్రాంతంలో కేవలం బోరు బావుల మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తారు. గత ప్రభుత్వం కాలువలు పూర్తి చేయకపోవడం వల్లనే రైతులకు ఇపుడు ఇబ్బందులు తలెత్తాయని నాగరాజు అన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మార్నేని రవిందర్ రావు తదితరులు అన్నారు.
————————-