ఆకేరు న్యూస్, పాల్వంచ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి విద్యుత్ వెలుగులను అందించిన పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) కర్మాగారం కూల్చివేత ముగింపు దశకు చేరుకుంది. ఓఅండ్‌ఎంలోని 8 యూనిట్లకు సంబంధించి ఎనిమిది కూలింగ్ టవర్లను నేలమట్టం చేశారు. మొదట నాలుగు టవర్లను కూల్చివేసిన అధికారులు తర్వాత మరో నాలుగింటిని తొలగించారు. ఓఅండ్ఎం కర్మాగారం మూతపడటంతో ఆ ప్రాంతంలోని కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు టవర్లను పేల్చివేయాలని యాజమాన్యం నిర్ణయించిన విషయం తెలిసిందే. పాత కర్మాగారానికి సంబంధించిన కూల్చివేత, అందులోని మెటీరియల్‌ను తీసుకునే విధంగా ముంబైకి చెందిన హెచ్ఆర్ కమర్షియల్ కాంట్రాక్టు కంపెనీ రూ.465 కోట్లకు టెండర్‌ను దక్కించుకొని పనులు పూర్తిచేసింది. ఇందులో భాగంగా అప్పటి కర్మాగారానికి సంబంధించిన మెటీరియల్ అంతా సంస్థ తీసుకెళ్లింది. మిగిలిన 8 కూలింగ్ టవర్లను సోమవారం ఉదయం 8 గంటలకు కూల్చివేసింది. వారంక్రితమే ఈ ప్రక్రియ పూర్తికావాల్సి ఉండగా అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో వాయిదా వేశారు. కాగా, టవర్ల కూల్చివేత సమయంలో ప్లాంట్‌నుంచి విద్యుత్ సరఫరా చేసే లైన్లలో రెండుగంటలపాటు విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు.
—————————————