* కాంగ్రెస్ ఆగడాలపై వార్నింగ్
ఆకేరు న్యూస్, సూర్యపేట : తుంగతుర్తి ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. రోజు రోజుకూ కాంగ్రెస్ ఆగడాలు పెరుగుతున్నాయని.. నాయకులు పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు పాల్పడుతుందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య ప్రాణాలు కోల్పోవడం పట్ల కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయులకు మధ్య దాడి ఘటనలో ఉప్పుల మల్లయ్య మృతి చెందాడు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్ తో పాటు మరో 15 మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. కాంగ్రెస్ ఓడిపోతామనే భయం పట్టకుందని.. అందుకే భౌతికదాడులకు పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల అరాచకాలు, గూండాగిరీని బీఆర్ ఎస్ ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
…………………………………
