అనారోగ్యంతో కేయూ ప్రొఫెసర్ భద్రూనాయక్ మృతి
నివాళులర్పించిన కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డి, డీన్ లు హన్మంతు, సమ్మయ్య
ఆకేరున్యూస్, వరంగల్ : కేయూ ప్రొఫెసర్ భద్రూనాయక్ అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతి చెందారు. కేయూలో హిస్టరీ, టూరిజం విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. కేయూ హాస్టల్స్, ఎస్సీ, ఎస్టీ సెల్ డెరెక్టర్‌గా పనిచేశారు.
1978లో కండక్టర్ గా నర్సంపేట డిపోలో భద్రూనాయక్ ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. 1979లో కేయూ విశ్వవిద్యాలయంలో క్లర్క్ గా చేరారు. ఉద్యోగం చేస్తూనే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో (1080-83)లో బీఏ ఫస్ట్ ర్యాంక్ లో పాసయ్యారు. 1987లో ఎంఏ పట్టా పొందారు. 1988లో యూజీసీ జేఆర్ ఎఫ్‌కు ఎంపికయ్యారు. అలాగే, మరోవైపు డిపార్టుమెంటల్ పరీక్ష రాసి సీనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. 1990లో చరిత్ర విభాగం అధ్యాపకుడిగా నియమితులై ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే 1994లో ఎంఫిల్, 2001లో పీహెచ్డీ పూర్తి చేసి రీడర్ గా తదనంతరం ప్రొఫెసర్ గా ఎదిగారు. కాకతీయ విశ్వ విద్యాలయంలో ఉద్యోగ బాధ్యతలతో పాటు అనేక పరిపాలనా పదవులను నిర్వర్తించారు. యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా, హాస్టల్ వార్డెన్ గా, కాకతీయ అధ్యయన కేంద్రం డైరెక్టర్ గా, చరిత్ర శాఖాధిపతిగా, హాస్టల్స్ డైరెక్టర్ గా, చరిత్ర శాఖకు బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ గా, అంబేద్కర్ స్టడీస్ సెంటర్ డైరెక్టర్ గా పనిచేసి తనదైన ముద్ర వేయడంలో ఆయనకు ఆయనే సాటిగా నిలిచారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు నిర్వహించారు.
ఆచార్యుడిగా విశిష్ట సేవలు..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉత్తమ విద్య ఉద్యోగాలు, మెరుగైన జీవనోపాధి మార్గాలు
వాటిపైనే పేద వర్గాల విముక్తి ఆధారపడి ఉందని గ్రహించారు. కేయూ ప్రొఫెసర్ భద్రూనాయక్ పర్యవేక్షణలో 10మంది ఎంఫిల్, 11మంది పీహెచ్డీ పూర్తి చేశారు.
దళిత ఉద్యమమే ఊపిరిగా..
వరంగల్ జిల్లాలోని ఏ మారుమూల గ్రామంలోనైనా దళితులు, గిరిజనులకు అన్యాయం జరిగితే న్యాయ పోరాటానికి సిద్ధమయ్యేవారు. దళితులపై జరిగే దాడులను ఎదుర్కునేందుకు దళిత ప్రజా సంఘాలను సమన్వయం చేశారు. వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉంటూ ఊంటూ సంఘటిత పోరాటాలకు బాటలు వేశారు.
కేయూ ప్రొఫెసర్ భద్రూనాయక్ మృతదేహానికి కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీ.మల్లారెడ్డి, సైన్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ జీ హన్మంతు, ఫార్మసీ డీన్ ప్రొఫెసర్ గాదె సమ్మయ్య నివాళులర్పించారు.