* పవన్ పర్యటనతో తెరపైకి కుంకీ ఏనుగుల అంశం
* రిటైర్మెంట్కు సిద్దంగా ఉన్న కుంకీలు జయంత్, వినాయక్
* మరో ఎనిమిది కుంకీ ఏనుగులు ఏపీకి ఇచ్చేందుకు కర్ణాటక అంగీకారం
ఆకేరు న్యూస్, అమరావతి:
డిప్యూటీ సీఎం , అటవీ శాఖా మంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక పర్యటనతో కుంకీ ఏనుగుల అంశం తెరపైకి వచ్చింది. అసలు ఈ కుంకీ ఏనుగులు అంటే ఏమిటి..? ఇవి మన రాష్ట్రానికి ఎందుకు ఉపయోగపడుతాయని ఏపీ ప్రజలు చర్చించుకుంటున్నారు. డిప్యూటీ సీఎం కర్ణాటక పర్యటన వల్ల ఎనిమిది కుంకీ ఏనుగులు ఆంధ్రాకు రాబోతున్నాయి.
* కుంకీ ఏనుగులు ఏపీకి ఎందుకు..?
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు , ఉత్తరాంధ్ర లోని పలు జిల్లాల్లో ఏనుగుల గుంపు దాడులతో ప్రజలు బెంబేలెత్తి పోతారు. గుంపులుగా వచ్చిన ఏనుగులు వ్యవసాయ పంటలను, గ్రామాలను ధ్వంసం చేస్తాయి. వాటిని నిరోధించడం అంత సులువైన అంశమేమి కాదు. ఏనుగుల గుంపు గ్రామం మీద దాడి చేసిందంటే చాలు ప్రజలు ప్రాణాలరచేతిలో పెట్టుకుని పారిపోవాల్సిందే.. వీటి దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్న వారు లేక పోలేదు. ఏనుగుల నుంచి ప్రజలను, పంట పొలాలను రక్షించేందుకు అటవీ శాఖ సృష్టించిన అద్భుతమైన ఆయుధమే ఈ కుంకీ ఏనుగులు. కుంకీ ఏనుగుల ద్వారా అటవీ ఏనుగుల దాడులను తిప్పికొడుతున్నారు. కుంకీ ఏనుగుల దాటికి అటవీ ఏనుగుల గుంపు అనేక సార్లు తోక ముడిచిన సంఘటనలు ఉన్నాయి.
* జయంత్, వినాయక్‌లు రిటైర్ అవుతున్నాయి
ముల్లును ముల్లుతోనే తీయాలనే విదంగా ఏనుగుల దాడిని ఏనుగుల ద్వారా తిప్పికొట్టాలన్న ఆలోచనే కుంకీ ఏనుగుల సృష్టికి దారి తీసింది. కుంకీ ఏనుగులు అనగానే ఇవీ ప్రత్యేక మైన జాతి ఏనుగులు కావొచ్చన్న భావన చాలా మందిలో ఉంటుంది. అలాంటిదేమి లేదంటున్నారు అటవీ శాఖాధికారులు. ఏనుగుల్లో కొన్నిటిని గుర్తించి వాటికి శిక్షణ ఇస్తారు. వీటి సంరక్షణ కోసం అటవీ అధికారులతో పాటు ప్రత్యేకంగా మావటిలు ఉంటారు. దాడి చేసేందుకు వచ్చిన ఏనుగుల గుంపును కుంకీ ఏనుగులు తీవ్రం గా ప్రతిఘటించి పారి పోయే విదంగా చేస్తాయి. ఈ పనులను గత కొన్ని సంవత్సరాలుగా జయంత్, వినాయక్ అనే కుంకీ ఏనుగులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి. వీటి వయసు 60 దాటడంతో వీటికి రిటైర్మెంట్ ఇస్తున్నారు. దీంతో అటవీ ఏనుగుల దాడి నుంచి ప్రజలను, పంట పొలాలను రక్షించేందుకు కొత్త కుంకీ ఏనుగుల అవసరం వచ్చింది.
* కుంకీ ఏనుగులు సమర్థంగా పనిచేస్తాయి.
– చైతన్య, డిఎఫ్ఓ,చిత్తూరు జిల్లా
అడవి జంతువులలో కెల్లా అత్యంత తెలివైన జంతువు ఏనుగు..భారత దేశం మొత్తంలో ఏనుగుల జనాభా దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ. అభివృద్ధి పేరుతో మనిషి అడవులను అంతం చేస్తుండడంతో ఆహారం కోసం జంతువులు మానవ సమాజంలోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏనుగులు మనుగడ కోసం మన పంట పొలాల్లోకి జొరబడుతున్నాయి. ఆకలి తీర్చుకునే సందర్భం లో చెరకు, జొన్న తదితర చేలను ధ్వంసం చేసేస్తున్నాయి… దీంతో రైతులు అల్లాడుతున్నారు…ఈ నేపధ్యంలోనే ఏనుగుల నుంచి పంట పొలాలను రక్షించుకునేందుకు అటవీ శాఖ కొన్ని ప్రయత్నాలు చేపట్టింది…
ఏనుగుల లోనే మరి కొంత తెలివిగా ఉన్న వాటి నుంచి రెండు, మూడింటిని ఎంపిక చేసి వాటికి మావటి వాళ్లతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తాం. ఏనుగుల గుంపు దాడులు చేస్తున్న ప్రదేశానికి కుంకీలను ప్రత్యేక వాహనంలో తెచ్చి ఏనుగుల గుంపు ఉన్న చోట వదిలి పెడతాం. ఏనుగుల గుంపును అడవిలోకి కొంత దూరం తీసుకెళ్లి ప్రత్యేక సిగ్నల్స్ ద్వారా వాటికి మార్గాన్ని నిర్దేశిస్తాయి.కుంకీల నిర్ధేశంతో ఏనుగుల గుంపు తిరిగి వచ్చిన మార్గంలోనే అడవిలోకి వెళ్లి పోతాయి. మన రాష్ట్రం లో చిత్తూరు జిల్లా నైన్యాలలో ఉన్న కౌండిన్య జంతు ప్రదర్శన శాలలో జయంత్, వినాయక్ లు అటవీ శాఖ పర్యవేక్షణలో ఉండేవి. వయసు మీరడంతో జయంత్,వినాయక్ లను గుజరాత్ లోని జామ్ నగర్ కు తరలించే ప్రయత్నాలు అటవీ శాఖ చేపడుతోంది. వీటి స్థానంలో కర్ణాటకలోని మద్దికెర జంతు ప్రదర్శన శాల నుంచి మన రాష్ట్రానికి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
——————————————-