* బాలికలపై లైంగిక వేధింపులు
* తెలిసినా పట్టించుకోని ప్రధానోపాధ్యాయురాలు
* కలెక్టర్ దృష్టికి చేరిన వ్యవహారం
* త్రిసభ్య కమిటీ వేసిన కలెక్టర్
* కమిటీ నివేదికలో విస్తుపోయే నిజాలు
* ఏడాది కాలంగా బాలికలను వేధిస్తున్న అటెండర్ యాకూబ్ పాషా
* ప్రధానోపాధ్యాయురాలకి తెలిసినా పట్టించుకోని వైనం
*అటెండర్ ను అరెస్టు చేసి హెచ్ ఎంను సస్పెండ్ చేసిన అధికారులు
ఆకేరు న్యూస్, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోదారుణం చోటుసుకుంది. గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న యాకూబ్ పాషా అనే అటెండర్ రెండేళ్లుగా పాఠశాలలో చదువుతున్న బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధిస్తున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అటెండర్ యాకుబ్ పాషా పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిన సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటకు చెందిన ఎండీ యాకూబ్ పాషా కు కారుణ్య నియామకం కింద కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ గా ఉద్యోగం వచ్చింది, అయితే యాకుబ్ పాషా గత రెండేళ్లుగా విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఈ నెల 24న సఖి కౌన్సిలింగ్ సెంటర్ నిర్వాహకురాలి ద్వారా కలెక్టర్ పమేలా సత్పతికి విషయం చేరింది. దీంతో స్పందించిన కలెక్టర్ సీపీ గౌస్ అలంతో చర్చించి డీడబ్ల్యూఓ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ , గంగాధర ఎంఈవోలతో త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేయించారు. త్రిసభ్య కమిటి విచారణలో విస్తు పోయే నిజాలు వెలుగు చూశాయి గత రెండేళ్లుగా విద్యార్థినులను వేధిస్తున్నట్లుగా తెలిసింది.
పట్టించుకోని హెచ్ ఎం.
అటెండర్ యాకూబ్ పాషా వ్యవహారం గురించి పాఠశాల బాలికలు హెచ్ ఎం కమలకు ఫిర్యాదు చేసినా ఆమె పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆమె అటెండర్ యాకూబ్ పాషాను వెనుకేసుకొస్తున్నట్లు తెలిసింది. అంతే కాకుండా ఈ విషయం బయటకు పొక్కకుండా సిబ్బందిని పిలిచి హెచ్చరించినట్లు సమాచారం. ఈ విషయం బయటకు తెలిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్ ఎం సిబ్బందితో అన్నట్లు తెలుస్తోంది. దీంతో సిబ్బంది బయటకు చెప్పకుండా ఉన్నట్లుసమాచారం.
యాకూబ్ పాషా అరెస్ట్ రిమాండ్ కు తరలింపు
విద్యార్థినులపై లైంగికదాడి జరిగినట్టు నిర్ధారించుకున్న రూరల్ ఏసీపీ.. అటెండర్ యాకూబ్‌ను అరెస్ట్ చేయాలని ఆదేశించడంతో మంగళవారం ఉదయం రేకుర్తి చౌరస్తాలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యాకూబ్ పాషాపై బీఎన్ఎస్, పోక్సో, ఐటీ చట్టాల్లోని కఠినమైన సెక్షన్లలో కేసు నమోదు చేశారు. విద్యార్థినులు విషయం చెప్పినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లక పోవడంతో పాఠశాల హెచ్ఎం కమలను కలెక్టర్ సస్పెండ్ చేశారు. అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్ దాటి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న మరో పది మంది ఉపాధ్యాయులకు విషయం తెలిసినా అధికారుల దృష్టికి తీసుకెళ్లని కారణంగా.. వారికి సైతం షోకాజ్‌లు జారీ చేస్తూ మూకుమ్మడి బదిలీ చేశారు
బండి సంజయ్ సీరియస్
గంగాదర మండలం కురిక్యాల పాఠశాలలో జరిగిన వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్ అయ్యారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థినుల తల్లి దండ్రలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాధ్యులపై కఠిన చర్యలు : ఎమ్మెల్యే సత్యం
విద్యార్థులపై వేధింపుల ఘటనలో బాధ్యులైన ప్రతి ఒక్కరిపైనా కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు. మంగళవారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్‌తో ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థినులకు సహకారం : మహిళా కమిషన్ చైర్పర్సన్
అటెండర్ అసభ్యప్రవర్తనకు గురైన విద్యార్థినులకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సహా పోలీస్ అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కేసు పురోగతిని మహిళా కమిషన్ పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.
తల్లిదండ్రుల ఆగ్రహం
లైంగిక వేధింపుల విషయం తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు భగ్గుమన్నారు. మంగళవారం పెద్ద సంఖ్యలో పాఠశాలకు వచ్చి, ఆందోళనకు దిగారు. కరీంనగర్, జగిత్యాల రహదారిపైకి వచ్చి రాస్తారోకో చేశారు. కీచక అటెండర్ దారుణాల గురించి హెచ్‌ఎంతోపాటు ఉపాధ్యాయులకు తెలిసినా పట్టించుకోలేదని, మూడు నెలలకోసారి జరిగే పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లోనూ ఈ విషయాన్ని చర్చించలేదని తల్లిదండ్రులతోపాటు ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. నిందితుడితోపాటు దారుణమైన ఈ విషయాన్ని దాచిపెట్టిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
……………………………………………………………………………
