ఆకేరు న్యూస్ డెస్క్ : కొండచరియలు విరిగిపడడంతో ఆఫ్రికా (Africa) దేశంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దాదాపు 50 మందికిపైగా మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి మీడియా చెబుతోంది. దక్షిణ ఇథియోపియా (Southern Ethiopia) ప్రాంతీయ రాష్ట్రంలోని గోఫా జిల్లా (Gofa District) లో జరిగిన ఈ ఘటన వివరాలు అక్కడి మీడియా కథనాల ప్రకారం.. భారీ వర్షాలకు సోమవారం ఉదయం కొండ చరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు, స్థానిక పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీసే చర్యలు ప్రారంభించారు. అంతలోనే మరోసారి కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ గుమిగూడిన ప్రజలు, సహాయక బృందాలు ఈ శిథిలాల్లో చిక్కుకుపోయారు. మంగళవారం ఉదయం వరకూ దాదాపు 50 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
———————–