* జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్
ఆకేరు న్యూస్, ములుగు: వచ్చే సంవత్సరం జనవరి 28 నుండి 31వ తేదీ వరకు జరగనున్న మహా మేడారం జాతరను పాత్రికేయులు, పోలీస్ సిబ్బంది, జిల్లా యంత్రాంగంతో కలసి సమన్వయంగా విజయవంతం చేద్దామని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ అన్నారు. గత జాతర పరిసరాలలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని అందరితో కలిసి ముందుకు వెళ్దామని ఎస్పీ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో పాత్రికేయులతో సమన్వయ కమిటీ సమావేశం ఓ ఎస్ డి శివం ఉపాధ్యాయ, డి.ఎస్.పి రవీందర్ లతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న మహా జాతరకు కోటి 50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవడానికి పదివేల మంది పోలీస్ సిబ్బంది నియమిస్తున్నామని, మేడారంలోని అమ్మవార్ల గద్దల వద్ద మాస్టర్ ప్లాన్ తో పనులు కొనసాగుతున్నాయని వివరించారు. జాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించుకోవడానికి అందరికీ ఒకే నిబంధనలు ఉంటాయని, 99 శాతం ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుందామని తెలిపారు. గతంలో రెండు జాతర సందర్భంగా పనిచేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నానని, భక్తులకు ఇబ్బంది కలగకుండా అమ్మవార్లను దర్శించుకోవడానికి గతంలో ఉన్న క్యూలైన్లకు అదనంగా మరో ఐదు క్యూలైన్లను ఏర్పాటు చేయబోతున్నామని వివరించారు. 8 క్యూ లైన్ ల ద్వారా భక్తులను అమ్మవార్ల దర్శనం కోసం అనుమతించి మూడు గేట్ల ద్వారా బయటికి పంపించడం జరుగుతుందని, జిల్లా పోలీసు యంత్రాంగం తీసుకునే నిర్ణయాలకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. జాతర సందర్భంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబోతున్నామని, ప్రత్యేక నినాదంతో రోడ్డు ప్రమాదాలు జరగకుండా భక్తులకు వివరించడం జరుగుతుందని అన్నారు. జాతర సందర్భంగా ఇతర సమయాలలో పలు రకాల వాహనాలు వేగంగా వెళ్లకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ములుగు జిల్లాలో గంజాయి అమ్మకాలు జరగకుండా నిఘా ఏర్పాటు చేయబోతున్నామని, చెడు వ్యసనాలపై యువకులకు అవగాహన కలిగించడానికి కళాబృందాలచే అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు. అక్రమంగా ఇసుక, ఎర్ర మట్టి, ఇతర వస్తువులను అక్రమంగా రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామని, పలు రకాల పశువులు జాతీయ రహదారిపై రాకుండా వాటికి సంబంధించిన యజమానులకు ముందు సమాచారం అందించి వినని పక్షంలో పశువులను గోశాలకు తరలిస్తామని అన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ములుగు జిల్లాలో పలు రకాల పనులు చేయడానికి వచ్చిన సందర్భంలో వారి వివరాలను పూర్తిగా సేకరించాలని, దీంతో పలు సంఘటనలు చోటు చేసుకోకుండా అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మేడారం జాతర సందర్భంగా పాత్రికేయులు ఎలాంటి ఇబ్బందులు గురికాకుండా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయడంతో పాటు వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడానికి ఆలోచిస్తామని, జాతర లో పాత్రికేయులు సహకరించాలని కోరారు. ఎలాంటి సంఘటనలు జరిగిన తన దృష్టి కానీ ఇతర అధికారులు దృష్టి గానీ తీసుకపోవాలని, ప్రతి విషయాన్ని భూతద్దంలో చూపించకుండా సమస్య పరిష్కారం కోసం పాత్రికేయులు సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు.
………………………………………………………………….
