– నోటిపికేషన్ విడుదల
– ప్రారంభమైన నామినేషన్ల దాఖలు పర్వం
– నామినేషన్ల దాఖలుకు మంచి రోజులు ఇవే
ఆకేరు న్యూస్, న్యూ ఢిల్లీ: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరంలో మరింత జోరు పెరగనుంది. మొత్తం 7 దశల్లో జరగనున్న దేశంలోని అన్ని లోకసభ స్థానాలకు, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు, తెలంగాణలో కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈరోజు నుంచే నామినేషన్ల స్వీకరణ మొదలైంది. 25 వరకు నామినేషన్ల దాఖలు చేయవచ్చు. 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. చివరికి ఈ29న నామినేషన్ల ఉప సంహరణతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. తొలిరోజే నామినేషన్లు వేసేందుకు పలువురు అభ్యర్థులు ఉత్సాహం చూపుతున్నారు. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఈరోజే నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే.. ఏపీలో ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 7 దశల ఎన్నికల్లో భాగంగా రేపు తొలి దశ పోలింగ్ జరగనుంది. లోక్సభ ఎన్నికలకుగానూ ఇదివరకే 3 దశల ఎన్నికల నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది ఎన్నికల సంఘం.
నాలుగో దశలో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు 96 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ (25 స్థానాలు), తెలంగాణ (17), బిహార్ (5), ఝార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), ఉత్తర్ ప్రదేశ్ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూకాశ్మీర్ (1). స్థానాలకు నాలుగో దశలో ఎన్నికల జరగనున్నాయి . దీనికోసం తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నాలుగో దశలో ఏపీ, తెలంగాణలలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ స్థానాలకు, తెలంగాణలో లోక్సభ ఎన్నికలతో పాటు ఖాళీ అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఇదే దశలో పోలింగ్ జరుగుతుంది. జూన్ 4 న ఓట్లు లెక్కించి, విజేతలను ప్రకటిస్తుంది ఎన్నికల సంఘం.
మంచి రోజులు ఇవే
ఈనెల 18, 19, 24 తేదీలు మంచిరోజులుగా పండితులు చెప్పడంతో ఆయా రోజుల్లోనే అధిక సంఖ్యలో నామినేషన్లను దాఖలు చేయనున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంతో ఎన్నికల జోరు నేటి నుంచి మరింత పెరగనుంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రక్రియ ఇలా..
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం : ఏప్రిల్ 18
నామినేషన్లు దాఖలుకు తుది గడువు : ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన : ఏప్రిల్ 26
నామినేషన్ల ఉప సంహరణ : ఏప్రిల్ 29
ఏపీ, తెలంగాణలో ఎన్నికలు : మే 13
ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన : జూన్ 4
——————–