* ఎవరు గెలిచేది ఎలా నిర్ణయిస్తారు..
* గత అనుభవాలు ఏం చెబుతున్నాయి..
* నేటి సాయంత్రం 6.30కు ఎగ్జిట్ పోల్స్
* సర్వత్రా ఉత్కంఠ
* 4 వరకూ ఎగ్జిట్‌పోల్స్ చర్చల్లో పాల్గొనబోం : కాంగ్రెస్
ఆకేరు న్యూస్ డెస్క్ : దేశంలో ఏకంగా 44 రోజులపాటు సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగింది. శనివారం జరిగిన ఏడో దశ పోలింగ్‌తో లోక్‌సభ ఎన్నికల అంకం పూర్తి అయింది. సాధారణంగా పోలింగ్ ముగిసిన వెంటనే వెల్లడయ్యే ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. ఈసారి ఇప్పటి వరకూ ఎక్కడా వెల్లడి కాలేదు. ఏడు దశల ఎన్నికలు పూర్తయ్యే వరకూ వెల్లడి చేయవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అందువల్లే తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలపై రోజుల తరబడి ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రధానంగా ఏపీలో అధికారంలోకి వచ్చేది ఎవరు అనే దానిపై తీవ్ర చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నేటి సాయంత్రంతో గెలుపోటములపై ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వెల్లడికానున్నాయి. ఈక్రమంలో ఎగ్జిట్ పోల్స్ ను ఎంత వరకు నమ్మొచ్చు.. గెలుపోటములను ఎలా నిర్ణయిస్తారు.., గత అనుభవాలు ఏం చెబుతున్నాయి అనే అంశాలపై ఆకేరు న్యూస్ ప్రత్యేక కథనం..
ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? ఎలా నిర్వహిస్తారు..?
దేశంలోని 543 లోక్‌సభ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిషా రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ 7 దశల్లో ఎన్నికలు జరిగాయి. అయితే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఫలితాలు జూన్ 2 వ తేదీన వెలువడనుండగా.. మిగిలిన ఆంధ్రప్రదేశ్, ఒడిషా అసెంబ్లీలతోపాటు అన్ని లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4 న ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం చివరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టి తిరిగి అధికారంలోకి వస్తుందా లేక దాదాపు 30 ప్రతిపక్ష పార్టీలు కలిపి ఏర్పాటైన ఇండియా కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది.
ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ విడుదలైతే కొంతవరకు ఫలితాలపై అంచనా రానుంది. ఏవైనా ఎన్నికలు జరిగిన తర్వాత.. ఎన్నికల సంఘం ఫలితాలు వెల్లడించడానికి ముందు కొన్ని మీడియా సంస్థలు, ఇతర సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేస్తూ ఉంటాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్‌ను అన్ని విడతల ఎన్నికలు పూర్తి అయిన తర్వాత పోలింగ్ రోజు పోలింగ్ సమయం ముగిసిన అరగంట తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తుంది. అయితే ఈసారి ఎన్నికల తొలి విడత ప్రారంభమైన ఏప్రిల్ 19 వ తేదీ ఉదయం 7 గంటల నుంచి చివరి విడత జరిగే జూన్ 1 వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకుండా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో నేడు ఫలితాలపై ఒక అంచనా వెలువడనుంది.
పోలింగ్ ముగిసిన వెంటనే కీలక కేంద్రాల వద్ద ఆయా సంస్థలు ఓటర్లను నేరుగా ప్రశ్నిస్తాయి. వారి అభిప్రాయాలను తెలుసుకుంటాయి. ఒకే సమయంలో వేర్వేరు కేంద్రాల వద్ద ఈ సర్వే చేపడతాయి. ఆ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది అంచనా వేస్తాయి. ఏ పార్టీకి ఆధిక్యం లభిస్తుంది.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది వంటివి పేర్కొంటాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి గెలుస్తారు.. ఎంత ఆధిక్యంతో విజయం సాధిస్తారు అనే విషయాలను తెలుసుకుంటాయి. పోలింగ్ పూర్తి అయిన తర్వాత సర్వే ఏజెన్సీలు.. ఓటర్ల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఉంటాయి.
ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ గానే ఉంటాయా?
మన భారత దేశంలో తొలిసారి 1957 ఎన్నికల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా 20 వేల నుంచి 30 వేల మంది ఓటర్లను శాంపిల్‌గా తీసుకుని సర్వే చేసేవారని సీనియర్ విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో నిర్వహించిన రెండో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 1957లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్.. పోస్ట్ పోల్ సర్వేను నిర్వహించింది. ఇక 1996 లో దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ నిర్వహించేందుకు.. ప్రభుత్వ ప్రసార ప్రసార సంస్థ దూరదర్శన్.. సీఎస్‌డీఎస్‌ను నియమించింది. ఆ తర్వాత పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం ప్రారంభించాయి. ఇందులో కొన్ని సంస్థలు మీడియాతో జతకట్టి ఎగ్జిట్ పోల్స్ వెలువరుస్తున్నాయి. అయికే గత కొన్నేళ్లుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ఫైనల్ ఫలితాలు దాదాపు సమానంగా ఉంటున్నాయని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. కొన్ని సంస్థలు వెల్లడించే ఎగ్జిట్ పోల్స్ కు విశ్వసనీయత ఉంది. 2014, 2019 లోక్ సభ, తెలుగు రాష్ట్రాలలోని అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్.. ఎన్నికల పోల్స్ కు దగ్గరగా ఉండడమే ఇందుకు నిదర్శనం.
అయితే.. ఎగ్జిట్‌పోల్ అంచనాలు కూడా వాతావరణశాఖ అంచనాల మాదిరిగానే ఉంటాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇవి కొన్నిసార్లు చాలా కచ్చితంగా, కొన్నిసార్లు దగ్గరగా ఉంటాయని, కొన్నిసార్లు ఎగ్జిట్‌పోల్స్‌కు విరుద్ధమైన ఫలితాలు రావొచ్చని చెబుతున్నారు. సర్వే నిర్వహించిన సమయం, ప్రాంతం, ఓటరు మూడ్, శాంపిల్, శాంపిల్ పరిమాణం, ఇతర అంశాలను బట్టి ప్రీపోల్, ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆధారపడి ఉంటాయని పేర్కొంటున్నారు. ఉదాహరణకు 2004లో ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పగా, అందుకు విరుద్ధంగా ఫలితం రావడం గమనార్హం.ఈ ఎన్నికల్లో ఇండియాటుడే- మైయాక్సిస్, చాణక్య, ఇండియా టీవీ, న్యూస్ 18, సీఎన్‌బీసీ, ఎన్డీటీవీ.. వంటి పలు జాతీయ మీడియా సంస్థలతో పాటు ఏపీ- తెలంగాణకు చెందిన ఆరా వంటి ఎన్నికల సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించబోతోన్నాయి. ప్రస్తుతం ఈ ఎగ్జిట్ పోల్స్ మీదే అందరి దృష్టీ నిలిచింది.
కాంగ్రెస్ అధిష్ఠానం కీలక ఆదేశాలు
ఎగ్జిట్ పోల్స్ విడుదల సందర్భంగా టీవీ ఛానళ్లు నిర్వహించబోయే డిబేట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆయా డిబేట్లల్లో కాంగ్రెస్ నుంచి ఏ ఒక్కరూ కూడా పాల్గొనట్లేదు. పార్ట ప్రతినిధులుగా ఎవ్వరినీ పంపించవద్దంటూ అన్ని రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా నిర్ధారించారు. ఏడో విడత మినహా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, వారి ఇచ్చే తీర్పు ఏమిటనేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమై ఉందని అన్నారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్బంగా ప్రజాభిప్రాయం ఏమిటనేది తేటతెల్లమౌతుందని పేర్కొన్నారు.
————————