* ఇంకా పెండింగ్లోనే ఉన్న హైదరాబాద్ ,
వరంగల్ , కరీంనగర్, ఖమ్మం నియోజకవర్గాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నాలుగు లోక్ సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏడు జాబితాలను విడుదల చేసింది. ఢిల్లీలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికకు సంబందించి కసరత్తు చేశారు. అనంతరం తెలంగాణ లోని నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ జాబితా ప్రకటించారు. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ,భువనగిరి నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఆత్రం సుగుణ, నీలం మధు, చామల కిరణ్కుమార్ రెడ్డి లకు అవకాశం కల్పించారు.
1.ఆత్రం సుగుణ- ఆదిలాబాద్
2. నిజామాబాద్ – తాటిపర్తి జీవన్ రెడ్డి
3. భువనగిరి – చామల కిరణ్ కుమార్ రెడ్డి
4. మెదక్ – నీలం మధు
* పెండింగ్ లో ఉన్న నియోజకవర్గాలు
1. హైదరాబాద్ ,
2. వరంగల్ ,
3. కరీంనగర్,
4. ఖమ్మం
హైదరాబాద్ కు సంబందించి ముస్లీం మైనారిటీ వర్గాలకు టికెట్ కెటాయించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రముఖ టెన్నీస్ క్రీఢాకారిణి సానియా మీర్జా పేరు కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక వరంగల్ లోక్ సభ నియోజకవర్గానికి సంబందించి చాలా మంది ఆశావహులు ఉన్నారు. అధిష్టానం పరిశీలనలో మాత్రం దొమ్మటి సాంబయ్య, ఇందిర, పసునూరి దయాకర్ , జన్ను పరంజ్యోతి ల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఖమ్మం నియోజకవర్గానికి సంబందించి కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుల బంధువుల పేర్లు వినబడుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని,మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద రెడ్డి, మరో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు యుగంధర్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలోఇప్పటికే బీఆర్ ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మంలో కమ్మ సామాజికవర్గానికే ప్రాధాన్యత ఇవ్వాలన్న యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు సమాచారం. అదేవిదంగా ఇప్పటికే మంత్రి వర్గంలో ఉన్న వారి బంధువులకు ఇస్తే సమాజంలో తప్పుడు సంకేతాలు పోతాయని భావిస్తున్నారు. కొత్త వ్యక్తి కోసం సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇక కరీంనగర్ నియోజకవర్గానికి సంబందించి హుస్నాబాద్ మాజీ శాసన సభ్యుడు అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దాదాపు ఆయన పేరునే ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం .
——————-