*సిలిండర్ బుకింగ్ 21 రోజులు ఆగాల్సిందే*
ఆకేరు న్యూస్, కమలాపూర్:
యుద్ధం కారణంగా ఎల్పిజి సిలిండర్ల బుకింగ్ పెరగడంతో పానిక్ బుకింగ్‌లు, హోర్డింగ్‌ను అరికట్టడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుకింగ్ చేయాలంటే 21 రోజుల వరకు వేచి చూడాల్సిందే. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వల్ల దేశంలో ఎల్పీజీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఎల్పీజీ దిగుమతిదారు, దిగుమతుల్లో 85-90% మధ్యప్రాచ్యం నుంచే వస్తాయి. యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి దాదాపుగా మూసివేయబడటంతో మధ్యప్రాచ్యం నుంచి భారత్‌కు వచ్చే ఎల్పీజీ దిగుమతులు అంతరాయం అవుతున్న వేళ ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్‌లు గణనీయంగా పెరిగాయి. ఇకపై ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుకింగ్‌కు 21 రోజుల లాక్-ఇన్ పీరియడ్ విధించారు. అంటే, ఒక సిలిండర్ డెలివరీ అయిన తర్వాత మరో సిలిండర్ బుక్ చేసుకోవడానికి కనీసం 21 రోజులు వేచి ఉండాలి. ఈ నిబంధన గురువారం నుంచి అమలులోకి వచ్చింది.
