* తేనెటీగల దాడి నుంచి పిల్లలను కాపాడి ప్రాణాలర్పించిన అంగన్వాడీ సహాయకురాలు
ఆకేరు న్యూస్, కమలాపూర్:
అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న 40 ఏళ్ల కాంచన్ బాయి మేఘ్వాల్ తన ప్రాణాలను అర్పించి సుమారు 20 మంది చిన్నారులను తేనెటీగల దాడి నుంచి కాపాడింది. ఫిబ్రవరి 4న మధ్యప్రదేశ్లోని నీమచ్ జిల్లా రన్పూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో పనిచేసే కంచన్ బాయి (45) మధ్యాహ్న సమయంలో పిల్లల కోసం భోజనం సిద్ధం చేసి, పిల్లలకు నీళ్లు ఇవ్వడానికి అంగన్వాడి సమీపంలో ఉన్న చేతిపంపు వద్దకు తీసుకెళ్లింది. అదే సమయంలో ఆకస్మాత్తుగా అక్కడే చెట్టుపై ఉన్న తేనెటీగల గుంపు పిల్లల పైకి రావడంతో కంచన్ బాయి మానవ కవచంలా మారి, పిల్లల వైపు పరుగెత్తి వారిని అంగన్వాడీ భవనంలోకి తీసుకువెళ్లి, వారిపై చాపలు, రగ్గులు కప్పి 20 మంది చిన్నారులను రక్షించి తేనెటీగల దాడిలో గాయపడి మరణించింది. విషయం తెలవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె త్యాగాన్ని , ధైర్యసాహసాలను అందరూ ప్రశంసిస్తున్నారు.
రూ. 4 లక్షల ఆర్థిక సహాయం
– మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్
ఈ ఘటనపై స్పందించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ , అంగన్వాడీ కార్యకర్త కంచన్ బాయి తేనెటీగల దాడిలో మరణించడం అత్యంత విచారకరం, హృదయ విదారకం. ఈ దుఃఖ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమె కుటుంబానికి అండగా నిలుస్తుంది. మానవతా దృక్పథంతో, ఆమె కుటుంబానికి రూ. 4 లక్షల ఆర్థిక సహాయం అందించాలని నేను ఆదేశించాను. ఆమె పిల్లల విద్యా ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని సామాజిక వేదిక ఎక్స్ లో పేర్కొన్నారు. కాగా కంచన్ బాయి గ్రామానికి చివరన ఉన్న ఒక సామాన్య ఇంట్లో నివసించేది. ఆమె భర్త పక్షవాతంతో బాధపడుతున్నాడు, ఆమెనే కుటుంబంలో ఏకైక సంపాదనాపరురాలు. ఆమె అంగన్వాడీలోని పిల్లల కోసం వంట చేసి, ఒక స్వయం సహాయక బృందం ద్వారా స్వల్ప గౌరవ వేతనం సంపాదించేది.
————————————————————
