
* మరో 8 రోజుల్లోనే ప్రారంభం
* ఉత్తరప్రదేశ్‌లో కోలాహలం
* ఇప్పటికే చేరుకున్న సాధువులు, అఘోరాలు
* ప్రయాగ్‌రాజ్‌కు ఆరు వేలకు పైగా ప్రత్యేక రైళ్లు
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి :
మహా కుంభమేళాకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాద్భుతంగా ముస్తాబవుతోంది. 12 ఏళ్ల అనంతరం ఈనెలలో మొదలయ్యే మహా ఘట్టం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఎక్కడెక్కడి నుంచో అనేక మంది సాధువులు, అఘోరాలు మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు.. వస్తూనే ఉన్నారు. దీనిపై ఆకేరు న్యూస్ స్పెషల్ స్టోరీ..
అసలేంటి.. కుంభమేళా
సాధారణంగా కుంభ మేళా ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలలో జరుగుతుంది. పూర్ణ కుంభ మేళా అనేది 12 ఏళ్లకోసారి ప్రయాగ, (అలహాబాద్), హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలో జరుగుతుంది. పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తి అయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభ మేళా జరుగుతుంది. త్రివేణి సంగమం, పుణ్యనదుల వద్ద అతిపెద్ద భక్తజనం కలయికనే కుంభమేళాగా పేర్కొంటారు. త్రివేణి సంగమాన్ని దర్శించుకుని స్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ఎప్పుడంటే..
ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో ఈనెల 13 భోగి రోజు నుంచి మహా కుంభమేళా ప్రారంభంకానుంది. 45 రోజుల పాటు కుంభమేళా కొనసాగనుంది. ఫిబ్రవరి 26న మహా శివరాత్రితో ముగుస్తుంది. భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. కుంభమేళాలో పాల్గొనే భక్తుల సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్కించడంతో పాటూ వారికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. 12 ఏళ్ల క్రితం జరిగిన కుంభమేళాకు 20 కోట్లమంది భక్తులు హాజరయ్యారని, ఈసారి భారత్ నుంచే కాకుండా, 123 దేశాల నుంచి 30 కోట్ల నుంచి 50 కోట్ల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
విశిష్టమైనరోజులు మరింత ప్రత్యేకం
ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళాలో జనవరి 14 (మకర సంక్రాంతి), జనవరి 29 (మౌని అమావాస్య), ఫిబ్రవరి 3 (వసంత పంచమి)నషీహి స్నాన్ జరుగుతుంది. ఈ నలభై ఐదు రోజుల్లో 6 రోజులను భక్తులు ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ రోజుల్లో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు భారీగా తరలివస్తారు. భక్తులతో పాటు నాగ సాధువులు, కల్పవాసీలు (నెల రోజుల దీక్ష చేసేవారు), పీఠాధిపతులు, మఠాధిపతులు కూడా కుంభమేళాకు వస్తారు.
ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళాలు
నాలుగు ప్రాంతాల్లో కుంభమేళాలు నిర్వహిస్తారు. ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లో మేళా జరుపుతారు. ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం ఉంది. అదే హరిద్వార్‌లో గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఉజ్జయినిలో శిప్రా, నాసిక్‌లో గోదావరి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. బోలెడు నదులున్నా ఈ నదుల్లోనే, అదీ ఆ నాలుగు ప్రదేశాల్లోనే కుంభమేళా నిర్వహించడం వెనుక భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సామ, అధర్వణ వేదాల ప్రకారం.. దేవతలు, రాక్షసులు సముద్ర మథనం చేయగా.. అందులో నుంచి అమృత కలశం బయటకు వస్తుంది. దాన్ని తొలుత జయంతుడు అనే కాకి నోట కరచుకొని భూమి చుట్టూ తిరిగొస్తుంది. ఆ సమయంలో కలశంలోని నాలుగు చుక్కలు ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినిలో పడ్డాయని.. అందుకే ఆ ప్రదేశాలకు అంత మహత్తు ఉందని అంటుంటారు.
వేలాది ప్రత్యేక రైళ్లు
కోట్లలో భక్తులు రానుండంతో ప్రయాణికుల కోసం వేలాది ప్రత్యేక రైళ్లను వేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వెళ్లే భక్తులు రాజస్నానం అనంతరం స్థానికంగా ఉండే హనుమాన్ ఆలయం, అలోప్ మందిరం, అలహాబాద్ కోట, ఆనంద్ భవన్, చంద్రశేఖర్ అజాద్ పార్కు సందర్శించుకోవచ్చు. ప్రయాగ్ రాజ్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో అయోద్య, 130 కిలోమీటర్ల దూరంలో వారణాసి ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు 6,580 సాధారణ రైళ్లతో పాటూ 992 ప్రత్యేక రైళ్లు సిద్ధం చేస్తోంది రైల్వే శాఖ.
……………………………………………………