ACB officials caught Narsimhulapet MPDO Radhika
* రూ. 45వేల లంచంతో పట్టుబడ్డ ఎంపీడీవో రాధిక
ఆకేరు న్యూస్, మహబూబాబాద్:
మహబూబాబాద్ జిల్లాలో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ అధికారులు రైళ్లను పరిగెత్తించారు. జిల్లాలోని నర్సింహులపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) కార్యాలయంపై ఏసీబీ అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ సోదాల్లో ఎంపీడీవో రాధిక లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
* రూ. 45 వేలు లంచం తీసుకుంటుండగా..
ఒక అధికారిక పనిని పూర్తి చేయడానికి నర్సింహులపేట ఎంపీడీవో రాధిక రూ. 45,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కార్యాలయంలో బాధితుడి నుంచి ఎంపీడీవో రాధిక రూ. 20 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఒక్కసారిగా దాడి చేసి, ఆమెను రసాయన పరీక్షల ఆధారంగా అడ్డంగా బుక్ చేశారు.
* మరో అధికారి కూడా అదుపులోకి..
ఈ అవినీతి భాగోతంలో ఎంపీడీవోకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ప్రభుత్వ అధికారి యాకయ్యను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరిని అధికారులు తీవ్రంగా విచారిస్తున్నారు.
* కొనసాగుతున్న సోదాలు..
ఎంపీడీవో కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. కార్యాలయానికి సంబంధించిన పలు కీలక ఫైళ్లను, రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎంపీడీవో రాధిక గతంలోనూ ఏమైనా అక్రమాలకు పాల్పడ్డారా? అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. ఈ దాడితో నర్సింహులపేట ప్రభుత్వ కార్యాలయాలలోని మిగతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
