Mahabubabad Govt Hospital
* జిల్లా ఆస్పత్రిలో పట్టపగలే బంగారం గొలుసు మాయం
* సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై ఆందోళన
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పట్టపగలే బంగారం గొలుసు మాయమైన ఘటన కలకలం రేపింది. ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ మెడలోని సుమారు తులం బంగారం గొలుసు కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* ఎక్స్రే గదికి వెళ్లి వచ్చేలోపే..
గంగాధర్ పుష్ప అనే మహిళ వైద్య పరీక్షల కోసం మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎక్స్రే గదికి వెళ్లి, ఎక్స్రే తీసుకున్న అనంతరం బయటకు వచ్చే సమయానికి ఆమె మెడలో ఉన్న బంగారం గొలుసు కనిపించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆస్పత్రి పరిసరాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదని సమాచారం. బంగారం గొలుసు మాయమైన విషయం తెలియడంతో బాధితురాలి తల్లి, అక్కాచెల్లెళ్లు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తమ బంగారం గొలుసు ఎక్కడ మాయమైందో తెలియక వారు కన్నీటిపర్యంతమైనట్లు తెలుస్తోంది.
* పనిచేయని సీసీ కెమెరాలు..
ఈ ఘటన నేపథ్యంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని సీసీ కెమెరాల పనితీరుపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కొన్ని సీసీ కెమెరాలు పనిచేయడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో రోగులు, వారి బంధువులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి ప్రదేశాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం భద్రతపై ఆందోళన కలిగించే అంశంగా మారింది.
* పట్టించుకోని వైద్య సిబ్బంది..
బంగారం గొలుసు మాయమైన విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినప్పటికీ తగిన స్థాయిలో స్పందించలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై ఆస్పత్రి అధికారులు స్పందించి, సీసీ కెమెరాల పరిస్థితిని పరిశీలించి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
గొలుసు మాయం కావడంపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఆస్పత్రి పరిసరాల్లోని అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను పోలీసులు పరిశీలించే అవకాశం ఉంది. గొలుసు నిజంగా ఎక్కడ, ఏ పరిస్థితుల్లో మాయమైందనే విషయం దర్యాప్తులో స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
