Cyber Fraud
* 22 మంది అరెస్ట్
* 216 పాస్‌బుక్స్, వాహనాలు
* డిజిటల్ ఆధారాలు స్వాధీనం
ఆకేరు న్యూస్, వరంగల్ : మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా అంతర్రాష్ట్ర సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను వరంగల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 22 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి 216 బ్యాంక్ పాస్‌బుక్స్, వాహనాలు, డిజిటల్ ఆధారాలు, సిమ్ కార్డులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా 185 సైబర్ నేర లింకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
దేవరుప్పుల, జనగామతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల్లోనూ ఈ ముఠాకు సంబంధించిన సైబర్ మోసాల లింకులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ములుగులోని మ్యూల్ బ్యాంక్ ఖాతాలు, బ్యాంకింగ్ వివరాలు, సిమ్ కార్డులను సమకూర్చడం, నిర్వహించడం, దుర్వినియోగం చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు.
ఈ దర్యాప్తును వరంగల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ Cr.No.29/2026, ఆజంజాహీ మిల్ కాలనీ పోలీస్ స్టేషన్ Cr.No.672/2026 కేసుల సమన్వయంతో నిర్వహించారు. నిందితులపై BNS సెక్షన్లు 316(2), 318(4), 319(2), 338, 336(3), 351(2), 111 r/w 3(5)తో పాటు IT Act-2000లోని 66-C, 66-D సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కేసు వివరాలు..
వరంగల్ DCC బ్యాంక్ నుంచి అందిన సమాచారం మేరకు బ్యాంకు ఖాతాదారుల వ్యక్తిగత ఆధారాలను ఉపయోగించి ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు బ్యాంకు ఖాతాలను తెరిపించి వాటిని సైబర్ మోసాలకు వినియోగించినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు.
నిందితుల నుంచి స్వాధీనం..
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుల నుంచి 216 బ్యాంక్ పాస్‌బుక్స్, వాహనాలు, డిజిటల్ పరికరాలు, సిమ్ కార్డులు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముఠా కార్యకలాపాలకు సంబంధించిన మరిన్ని వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
నగదు, సిమ్ కార్డుల కమిషన్..
స్థానిక ఏజెంట్ల ద్వారా MUDRA యోజన పథకం కింద రూ.50 వేల రుణం ఇప్పిస్తామని చెప్పి అమాయక ప్రజలను నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారి బ్యాంకు ఖాతాలను ఇతరులకు అప్పగించినట్లు వెల్లడించారు.
అదేవిధంగా DCCB బ్యాంక్, నెక్కలగుట్ట బ్రాంచ్ సహా వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి, బ్యాంక్ పాస్‌బుక్స్, ATM కార్డులు, PAN వివరాలు, ఆధార్ ఆధారిత SIM కార్డులను ఇతరులకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో ఖాతాకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు నగదు కమిషన్‌గా తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
