* అమెరికా మృతులకు కడసారి వీడ్కోలు
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ : ఒకరిని విడిచి ఒకరు ఉండలేని ప్రాణ స్నేహితులు వారు. బాల్యం నుండి ఇంజనీరింగ్ వరకు కలిసి చదువుకున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ కూడా ఒకేచోట ఉంటూ MS చేయాలనుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 28న అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.. కానీ విధి ఆ స్నేహితులిద్దరినీ మృత్యువు రూపంలోనూ విడదీయలేదు. ఇకవివరాల్లోకి వెళ్తే..మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామానికి చెందిన పి. నాగేశ్వరరావు, శిరీషల కుమార్తె మేఘనారాణి (24), అలాగే ముల్కనూరు గ్రామ ఉపసర్పంచ్ కె. కోటేశ్వరరావు, రేణుకల కుమార్తె భావన (25) వీరిద్దరూ ప్రాణ స్నేహితులు. అమెరికాలోని ఒహాయో రాష్ట్రం డేటన్లో ఉంటూ ఎం.ఎస్ పూర్తి చేశారు. అయితే వారు ఉద్యోగం వెతకడం ప్రారంభించారు. కానీ విధి వారిని వంచించింది. గత డిసెంబరు 28వ తేదీన అమెరికాలోని అలబామా హిల్స్ కు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మేఘనారాణి, భావన ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మరణవార్త విని గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ బిడ్డల మృతదేహాల కోసం తల్లిదండ్రులు గత 14 రోజులుగా కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఎదురుచూశారు. చివరకు శంషాబాద్ ఎయిర్పోర్టు అసిస్టెంట్ సీనియర్ మేనేజర్ గంగావత్ వెంకన్న.. మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంలో తన వంతు సహాయం చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మృతదేహాలు గ్రామానికి తీసుకువచ్చారు.
ఒకే చోట ఇద్దరి అంతిమ సంస్కారాలు:
ఈ ఇద్దరు స్నేహితుల బంధం మరణంలోనూ విడిపోకూడదని భావించిన కుటుంబ సభ్యులు, ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. ఉపసర్పంచి కోటేశ్వరరావుకు చెందిన పొలంలోనే ఇద్దరికీ ఒకే చోట అంత్యక్రియలు చేశారు. ఈ అంత్యక్రియలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి కన్నీటి నివాళులర్పించారు. మరణంలోనూ విడిపోని వారి స్నేహాన్ని చూసి స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు.
………………………………………………………………..

