
* భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగొద్దు
* పోలీసు, మున్సిపల్, విద్యుత్ ఇతర శాఖలతో సమన్వయంగా పని చేయండి
* ఉపవాసం ఉండే భక్తులకు ఉచితంగా పండ్లు, అల్పాహార పంపిణీ చేయాలి
* రివ్యూ మీటింగులో అధికారులకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశాలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: మహా శివరాత్రి పండగ పర్వదినం నేపథ్యంలో అన్ని శైవ క్షేత్రాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు మహా శివరాత్రి పర్వదినం జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ మంత్రి కొండా సురేఖ మంగళవారం సచివాలయంలో ఆ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల్లో మహా శివరాత్రి సందర్భంగా ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈవోలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, కీసర రామలింగేశ్వర స్వామి, ఏడుపాయల వన దుర్గ భవానీ అమ్మవారు, రామప్ప, మేళ్ళచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవస్థానం, చాయా సోమేశ్వర ఆలయం పానగళ్ళు, సోమేశ్వర దేవస్థానం పాలకుర్తి, వెయ్యి స్థంభాల గుడి, మెట్టుగుట్ట దేవాలయం, కాశిబుగ్గ ఆలయం, భద్రకాళి, తదితర దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లపై మంత్రి సురేఖ అధికారులను సేకరించారు. గతేడాది శివరాత్రి ఉత్సవాల నిర్వహణా అనుభవాల ఆధారంగా ఈ సంవత్సరం భక్తులకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం రుద్రాభిషేకం, సామూహిక బిల్వార్చన, రుద్ర హోమం, ప్రవచనాలతో పాటు క్యూలైన్ మేనేజ్మెంట్, తాగునీరు వసతి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, విద్యుత్ వసతి, వాహనాల పార్కింగ్, ఆరుబయట ప్రదేశాల్లో విద్యుద్దీపాల ఏర్పాటు, చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులు మంత్రికి సమగ్రంగా వివరాలు తెలిపారు. మంత్రి కూడా కొన్ని ప్రత్యేక సూచనలు అందజేశారు.
ఎండా కాలం సమీపిస్తున్న నేపథ్యంలో తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉపావసం ఉండే భక్తులకు పండ్లు, అల్పాహారం ఉచితంగా పంపిణీ చేయాలని తెలిపారు. ప్రతి ఆలయం దగ్గర ఎంట్రీ పాయింటులు, ఎగ్జిట్ పాయింటులను పోలీసు శాఖతో సమన్వయం చేసుకొని పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ దేవాలయాల దగ్గర ఎక్కడా లిక్కర్ అమ్మకాలు చేయరాదని ఆదేశించారు. అందుకోసం ప్రత్యేకంగా గస్తీ ఏర్పాటు చేసి, లిక్కర్ దొడ్డి దారిని అమ్మినవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని అన్నారు. ఆయా దేవాలయాలున్న పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో స్థానిక, ఆంగ్ల భాషల్లో సూచీ బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భద్రత కోసం సీసీ కెమోరాల ఏర్పాటు, పారిశుధ్య చర్యలు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని… భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే చోట అంబులెన్స్ లు కూడా అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. అన్ని దేవాలయాలను సమన్వయం చేసేందుకు హైదరాబాద్ ఎండో మెంట్ కమిషనరేట్ ఆఫీసులో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరి నదీ, ఇతర నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో నదీ హారతి వంటి కార్యక్రమం చేపట్టేందుకు అవసరమైన కసరత్తు చేయాలని కోరారు. ఆగమ శాస్త్రాల ప్రకారం ఈ కసరత్తు చేయాలని చెప్పారు. మహా శివరాత్రి నిర్వహణకు ఖర్చుకు వెనకాడ కూడదని, ఏదైనా ఇబ్బంది ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిపేందుకు జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారులతో సమన్వయం అవసరమని మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు.
ఎండోమెంట్ అధికారులు బాగా పని చేస్తున్నారు
ఎండోమెంట్ శాఖ ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది బాగా పని చేస్తున్నారని మంత్రి సురేఖ ప్రశంసించారు. ఇటీవల తాను చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి జరిగిన నేపథ్యంలో ఆయనను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పరామర్శించేందుకు వెళితే ఆయన తండ్రి, పెద్దాయన సౌందర్ రాజన్ స్వయంగా తనకు ఈ విషయం చెప్పారని మీటింగులో గుర్తు చేశారు. తన నాయకత్వంలో రాష్ట్రంలో ఎండోమెంట్ శాఖ సమర్థవంతంగా పని చేస్తున్నట్టు కితాబు ఇచ్చినట్టు మంత్రి సమీక్షా సమావేశంలో అధికారులకు వివరించారు. ఆ పెద్దాయన ఇచ్చిన కితాబు తనకెంతో సంతోషం ఇచ్చిందని అన్నారు. శాఖ ఉన్నతాధికారులుగా మీరంతా పని చేస్తేనే ఈ పేరు వచ్చిందని సురేఖ స్పష్టం చేశారు. భవిష్యత్ లో కూడా ఇదే విధంగా పని చేయాలని సూచించారు. మన పని మనం చేసుకుంటూ పోతే… గుర్తింపు అదే వస్తుందని చెప్పారు. గుర్తింపు కోసం ప్రత్యేకంగా పని చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం శివరాత్రి సందర్భంగా ప్రతి ఈవో, ఉన్నతాధికారులు కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. బాగా పని చేసిన అధికారులను గుర్తించి తగు ప్రోత్సాహాకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, ఆర్జేసీ రామకృష్ణ, హైదరాబాద్ డీసీ కృష్ణ ప్రసాద్, వరంగల్ డిసి సంధ్యరాణి, జిల్లా అసిస్టెంట్ కమిషర్లు, అన్ని ప్రముఖ శివాలయాల ఈవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
……………………………………………..