* మేయర్ గుండు సుధారాణి
* కమీషనర్ అశ్విని తానాజీ వాఖేడేతో కలసి వింగ్ అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష
ఆకేరు న్యూస్, వరంగల్ : సద్దుల బతుకమ్మకు, దసరా ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం జిడబ్ల్యూఎంసీ కౌన్సిల్ హల్లో సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలను పురస్కరించుకొని బల్దియా వ్యాప్తంగా 66 డివిజన్లలో చేయాల్సిన ఏర్పాట్లపై కమీషనర్ అశ్విని తానాజీ వాఖేడేతో కలసి వింగ్ అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బల్దియా ఆధ్వర్యంలో ఇటీవల గణేష్ నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహించడంపై, అదేవిధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాల సందర్భంగా విధులు నిర్వర్తించిన అధికారులు, సిబ్బందిని మేయర్ అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో దసరా, బతుకమ్మ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో తెలంగాణ సాంస్కృతీ, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా బతుకమ్మ జరుపుకుంటారని.. వారి సౌకర్యార్థం అవసరమగు ఏర్పాట్లు చేయాలన్నారు. బల్దియా వ్యాప్తంగా బతుకమ్మ జరుపుకునే అన్ని ప్రాంతాల వద్ద మైదానం చదును, రహదారిపై గుంతలు పూడ్చాలని, డస్టింగ్, లైటింగ్, మంచినీటి సౌకర్యం తదితర మౌలిక సదుపాయాలతో పాటు చెరువులలో గుర్రెపు డెక్క తొలగించాలని,ఆయా పనులు వేగవంతంగా చేపట్టి సకాలంలో పూర్తి చేయాలన్నారు.
బతుకమ్మల నిమజ్జనం నిమిత్తం బల్దియా పరిధిలోని చిన్నవడ్డేపల్లి, కట్ట మల్లన్న, ఉర్స్ గుట్ట రంగలీలా మైదానం, తోట మైదానం, శివనగర్ గ్రౌండ్, రంగసాయిపేట, ఖిలా వరంగల్, బేస్తం చెరువు, మామునూరు పెద్ద చెరువు, బంధం చెరువు, భద్రకాళి దేవాలయం, వేయిస్తంభాల గుడి దేవాలయం, మెట్టుగుట్ట, పద్మాక్షి టెంపుల్, మడికొండ చెరువు, తదితర చెరువులలో గుర్రపు డెక్క తొలగింపు అక్టోబర్ 4వ తేదీ లోగా పూర్తి కావాలని ఆదేశించారు. అనంతరం కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ వాఖేడే మాట్లాడుతూ బల్దియా ఆధ్వర్యంలో ఎలాంటి లోటుపాట్లకు, నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ రాజేందర్ రెడ్డి, సీఎం హెచ్ ఓ డాక్టర్ రాజేష్, ఎస్సీలు ప్రవీణ్ చంద్ర, రాజయ్య, ఇన్చార్జి సిపి రవీందర్, ఉప కమిషనర్లు కృష్ణారెడ్డి, ప్రసన్న రాణి, శానిటేషన్ ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……………………………….