ఆకేరున్యూస్, చేర్యాల: గజ్జెల లాగులు.. ఢమరుక నాదాలు..డోలు చప్పులు..అర్చకుల పూజలు..ఒగ్గు పూజారుల పట్నాలు..పోతురాజుల విన్యాసాలు, మహిళల బోనాల సమర్పణలతో మల్లన్న క్షేత్రం పులకించిపోయింది. కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రానికి పట్నం వారం సందర్భంగా అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కొమురవెల్లి మల్లన్న ఉత్సవాలు పట్నం వారంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. కాగా, బ్రహ్మోత్సవాలలో మొదటి వారం పట్నం వారంగా పిలవడం ఆనవాయితీ..
రేపే పెద్దపట్నం..
మల్లన్న ఆలయవర్గాల సహకారంతో హైదరాబాద్ ఒగ్గు పూజారుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదీ భక్తులు మల్లన్న క్షేత్రంలోని కల్యాణ వేదిక వద్ద సోమవారం పెద్దపట్నం వేసి అగ్నిగుండం తయారు చేయనున్నారు. స్వామి వారి పట్నం వారానికి వచ్చిన భక్తులు పెద్దపట్నం, అగ్నిగుండం దాటి స్వామి వారిని మరోసారి దర్శించుకోనున్నారు. భక్తులు మొక్కుల అనంతరం నల్లపోచమ్మ, కొండపోచమ్మ ఆలయాలకు వెళ్లి అక్కడ అమ్మవార్లకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు.
………………………………………