Mamunur Airport
Mamunur Airport| అకేరు న్యూస్, హన్మకొండ: వరంగల్ మామునూరు విమానాశ్రయానికి తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం డిమాండ్ చేసింది. ఈ అంశంపై హన్మకొండ ప్రెస్ క్లబ్లో జర్నలిస్ట్ దామెర రవీందర్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య కీలక పాత్ర పోషించారని తెలిపారు. 1946 జూలై 4న ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడుతూ ఆయన అమరుడయ్యారని గుర్తుచేశారు.
తెలంగాణ చరిత్రలో ప్రజా ఉద్యమాలకు, సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటాలకు ప్రత్యేక స్థానం ఉందని సమావేశంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. వెట్టిచాకిరీ, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో అనేక మంది ప్రాణత్యాగం చేశారని తెలిపారు.
చాకలి ఐలమ్మ, షేక్ బందగీ, దొడ్డి కొమురయ్య వంటి పోరాట యోధుల చరిత్రను భవిష్యత్ తరాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కుల, మతాలకు అతీతంగా దొడ్డి కొమురయ్య పేరును మామునూరు విమానాశ్రయానికి పెట్టడం సముచితమని అభిప్రాయపడ్డారు.
మామునూరు విమానాశ్రయానికి దొడ్డి కొమురయ్య పేరు పెట్టే అంశంపై ముఖ్యమంత్రి గతంలో మాట్లాడిన విషయాన్ని ఫోరం ప్రతినిధులు ప్రస్తావించారు. ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని పేరు ఖరారు చేయాలని కోరారు. డిమాండ్‌పై స్పందన లేకపోతే ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
సమావేశంలో ఆజాద్, కడమంచి రాంబాబు, ఐలయ్య, మహేష్, పాణి, శ్రావణ్, శివ, తిరుపతి, లింగయ్య, శ్రీనివాస్, చార్వాక, కోడెల ప్రసాద్, రమేష్, ప్రభాకర్ తదితర విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
