Devji Sangram Chandranna Photos
* జన తెలంగాణ పార్టీతో మాకు ఎలాంటి సంబంధాలు లేవు
* స్పష్టం చేసిన మాజీ మావోయిస్ట్ నేతలు దేవ్ జీ, సంగ్రామ్, చంద్రన్న
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రజల కోసం పనిచేసే ప్రత్యేక సంస్థ తో పాటు అన్ని వామపక్ష సంస్థలతో కూడిన ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయబోతున్నామని సీపీఐ మావోయిస్ట్ పార్టీ మాజీ నేతలు తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న తదితర కేంద్ర, రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు ప్రకటించారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చ మొదలైంది.
* జన తెలంగాణ పార్టీతో మాకు సంబంధం లేదు..
ఇటీవల మాజీ మావోయిస్ట్ నేత లంకా పాపిరెడ్డి అలియాస్ లచ్చన్న , గురిజాల రవీందర్ రావు, బల్లా రవీంద్రనాద్ తదితరుల అద్వర్యంలో జన తెలంగాణ పార్టీని త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్టు సెప్టెంబర్ 19న ప్రకటించారు.
ఈ మేరకు విడుదల చేసిన ముసాయిదా ప్రణాళికను కూడా విడుదల చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్ళు గడిచినప్పటికీ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని అందులో ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జన తెలంగాణ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు లంకా పాపిరెడ్డి ప్రకటించారని వీరు పేర్కొన్నారు.
ఈ పార్టీలో కొందరు మాజీ మావోయిస్టు నాయకులు, సభ్యులు ఉండడంతో, ఈ మధ్య బహిరంగ జీవితంలోకి వచ్చిన దేవజీ, సంగ్రాం, చంద్రన్న తదితర మావోయిస్టు పార్టీ మాజీ కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులకు ఈ పార్టీతో ఏమయిన సంబంధాలున్నాయా? అన్న చర్చ ప్రజల్లో జరుగుతోందన్నారు. ఈ పార్టీతో మాకు ఎలాంటి సంబంధాలు లేవని ఈ సందర్భంగా ప్రజలకు స్పష్టం చేస్తున్నాం. అదే విదంగా ఇదే విషయాన్ని లంకా పాపిరెడ్డి కూడా ప్రకటించారు.
* మేమే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నాం..
సామ్రాజ్యవాద, దళారీ పెట్టుబడిదారీ, భూస్వామ్యవర్గాల దోపిడి, పీడనలకు వ్యతిరేకంగా, ఫాసిజానికి వ్యతిరేకంగా వామపక్ష, మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీలతో, ప్రజాస్వామిక వ్యక్తులతో, శక్తులతో, సంఘాలతో, సంస్థలతో, దళిత, ఆదివాసి, బహుజన,మత మైనారిటీ సంఘాలతో, సంస్థలతో, పార్టీలతో ఐక్యవేదిక (ఫ్రంట్) ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని దేవ్ జీ , సంగ్రామ్, చంద్రన్న ప్రకటించారు.
ఈ ఐక్యవేదిక ఏర్పాటుతో పాటు ప్రజల సమస్యలపై పనిచేసే ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం.
తాము ఏర్పాటుచేయబోయే సంస్థగానీ, ఐక్యవేదిక గానీ ప్రజల సమస్యలపై చట్టబద్దంగానే, బహిరంగంగానే పనిచేస్తాయన్నారు. తెలంగాణలోని విప్లవ శిబిరానికి చెందిన ప్రజలు ఇతర ఏ పార్టీల్లోనూ చేరకుండా తాము ఏర్పాటు చేయనున్న సంస్థలోనే చేరాల్సిందిగా పిలుపునిచ్చారు.
కనీస ఉమ్మడి కార్యాచరణ ప్రాతిపదికగా మేం ఏర్పాటుచేసే ఐక్యవేదిక (ఫ్రంట్) తో కలసి పనిచేయడానికి జన తెలంగాణ పార్టీ సహా ఏ పార్టీ సిద్ధపడ్డా అందుకు మేము సిద్ధమేనని కూడా మాజీ మావోయిస్ట్ నేతలు స్పష్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
