
* 18 ఏళ్ళ పాటు మావోయిస్ట్ పార్టీ మిలిటరీ నాయకుడు
* పీఎల్ జీఏ ఏర్పాటులో కీలక వ్యక్తి
* కోరాపుట్ ఆయుధ గిడ్డంగిపై దాడి సూత్రధారి
* ఆర్గనైజేషన్‌లోనూ అదే నైపుణ్యం
* ఆర్ ఈసీలో బీటెక్, ఎంటెక్ విద్య
( ప్రత్యేక ప్రతినిధి )
ఆకేరు న్యూస్, వరంగల్ , మే 21:
నక్సలిజం పై పోరాటంలో ఘన విజయం సాధించాం- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
నక్సలిజం పై పోరాటంలోగొప్ప విజయాన్ని సాధించాం. . ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో భద్రతా దళాలు 27 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. సీపీఐ మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్ర నేత అయిన నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు కూడా ఈ ఎన్ కౌంటర్లో మృతి చెందారు.- కేంద్ర హోం మంత్రి అమిత్ షా
ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోది , హోం మంత్రి హోదాలో అమిత్ షాలు స్పందించడం వెనుక చత్తీష్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్లో సీపీఐ మావోయిస్ట్ పార్టీ అగ్రనేత . ఆయన తల మీద ఏకంగా కోటిన్నర రూపాయల బహుమానం ప్రకటించబడి ఉంది. మావోయిస్ట్‌ల ఆయువు పట్టు లాంటినాయకుడు ఎన్ కౌంటర్లో మృతి చెందడమే కారణం..
ఈ రోజు చత్తీష్ గడ్‌లో జరిగిన భారీ ఎన్ కౌంటర్లో సీపీఐ మావోయిస్ట్ పార్టీ దళపతి నంబాళ్ళ కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ( 70 ) చత్తీష్ ఘడ్లో జరిగిన ఎన్ కౌంటర్లో మృతి చెందారు.
నంబాళ్ళ కేశవరావు ఆంధ్ర ప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం జియ్యన్నపేట గ్రామంలో 1955లో జన్మించాడు. వరంగల్ ఆర్ ఈసీ ఇప్పటి ఎన్ఐటీలో1974- 79 బ్యాచ్ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్
ఆ తర్వాత ఎంట్క్ చేశారు. ఆరడుగుల ఆజానుబాహువుడు , కబడ్డీ ఇతర క్రీఢల్లో ప్రావీణ్యం ఉండేదని కేశవరావు మిత్రులు చెబుతున్నారు. 1976- 77లో మహారాష్ట్ర లోని అకోలాలో జరిగిన ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీల్లో కాకతీయ యూనివర్సీటీ టీం వైస్ కెప్టెన్‌గా పాల్గొన్నాడంటున్నారు. ఆ కాలంలో విద్యార్థి రాజకీయాలు క్రీయా శీలకంగా ఉండేవి. రాడికల్ విద్యార్థి సంఘం అద్వర్యంలో పెద్ద ఎత్తున కళాశాలల్లో రాజకీయ కార్యకలాపాలు నడిచేవి. ఆ కార్యకలాపాల్లో పాల్గొన్న కేశవరావు కొంత కాలానికి పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. తూర్పు గోదావరి ఏజెన్సీలో పనిచేసిన అనంతరం చత్తీష్ గడ్కు వెళ్లారు. పీపుల్స్ వార్ పార్టీ గోదావరి ఆవలి ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాలు అంటే అప్పటి మద్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌లను కలిపి ఫారెస్ట్ లైజనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి మొదటి కార్యదర్శిగా మళ్ళా రాజిరెడ్డి పనిచేశారు. అనంతరం రెండవ నాయకుడిగా కేశవరావు బాధ్యతలు చేపట్టారు. ఈ కాలంలో పార్టీ విస్తృతికి ఎంతో కృషి చేశాడంటున్నారు.
* మిలిటరీ నిపుణుడు కేశవరావు
పీపుల్స్ వార్ పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పాటు చేయడంలో కేశవరాలు క్రీయాశీలక భూమిక. ఎల్ టీటీఈ గెరిల్లాల నుంచి శిక్షణ పొందిన కేశవరావు ఆ రంగంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు. మావోయిస్ట్ పార్టీ మిలిటరీ కమిషన్ చీఫ్ గా ఏకంగా 18 సంవత్సరాలు పనిచేశారు. పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్ట్‌గా రూపాంతరం చెందడంలో నంబాళ్ళ కేశవరావు పాత్ర కీలకమంటారు. దేశంలో ఉన్న గెరిల్లా సంస్థల ను సమన్వయ పరచడంలో భాగంగానే మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్, పార్టీ యూనిటీ అనే నక్సలైట్ పార్టీలు ఒక్కటై 2004లో సీపీఐ మావోయిస్ట్ పార్టీ గా ఆవిర్భవించింది. దేశమంతా పర్యటించి గెరిల్లా సంస్థల ఎత్తుగడలను అధ్యయనం చేసేవాడంటున్నారు. కెమికల్ ఇంజనీర్ గా అనేక రకాల విస్పోటణ ప్రక్రియలను మావోయిస్ట్ పార్టీకి పరిచయం చేసేవాడంటున్నారు.
* ట్రక్క్ల నిండా ఆయుధాలు
ఒరిస్సాలోని కోరాపుట్ – నయాగడ్లలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఆయుధ గిడ్డంగులపై మావోయిస్ట్ పార్టీ మెరుపు దాడులు చేసింది. మావోయిస్ట్ పార్టీ ట్రక్క్ల నిండా ఆయుధాలను ఎత్తుకెళ్లింది. దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున ఆయుధాలను అపహరించిన సంఘటన ఇప్పటి వరకు లేదంటున్నారు. ఈ దాడికి కేవలం మాస్టర్ మైండ్ తో పాటు స్వయంగా కేశవరావు ఈ దాడిలో పాల్గొన్నాడని చెబుతారు. మావోయిస్ట్ పార్టీని సాయుధం చేయడంలో కేశవరావు సక్సెస్ అయ్యారు. ప్లాటూన్లు, కంపెనీల నుంచి ఏకంగా బెటాలియన్లు ఏర్పాటు చేసే స్థాయికి మావోయిస్ట్ పార్టీ ఎదిగింది. మిలిటరీ పరంగానే కాకుండా సైద్ధాంతిక పునాది, ప్రజల ఆర్గనైజ్ చేసే నాయకత్వపు లక్షణాలు కేశవరావుకు ఉండడంతో 2018లో సీపీఐ మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీ నియమించింది.
* మూడంచెల భధ్రత ఏమాయే..?
సీపీఐ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులకే పటిష్టమైన భద్రత ఉంటుందని మావోయిస్ట్ పార్టీ మాజీ నేతలు అంటున్నారు. ఇక ఆ పార్టీ జనరల్ సెక్రటరీకి మూడంచెల భద్రత ఉంటుందంటున్నారు. ఆయనను కాపాడుకోవడానికి కనీసం వంద మంది సాయుధులు అత్యంత అధునాతన ఆయుధాలతో నిత్యం పహారా కాస్తుంటారని చెబుతున్నారు. నంబాళ్ళ కేశవరావు కు అలాంటి భద్రత లేకుండా పోయిందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయని మాజీ నేతలు అంటున్నారు.
* సమాంతర ప్రభుత్వం నుంచి..
మావోయిస్ట్ పార్టీని నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాయి. అటవీ ప్రాంతంలో పోరాడేందుకు స్థానికులను సమాయత్త పరచి సల్వాజుడుం లాంటి సంస్థలను ఏర్పాటు చేశారు. స్థానిక ఆదివాసీ యువత కావడంతో పెద్ద ఎత్తున మావోయిస్ట్ పార్టీ వీరి నుంచి ప్రతి ఘటనను ఎదుర్కొన్నది. న్యాయ పరమైన సమస్యలు రావడంతో చత్తీష్ గడ్ ప్రభుత్వం సల్వాజుడుం ను రద్దు చేసింది. మరో రూపంలో మరింత ఆధునికంగా ఈ ఫోర్స్ ను తయారుచేసింది. దీంతో పాటు ప్రత్యేక శిక్షణ స్థానిక బలగాలకు అందించింది. పారా మిలిటరీ బలగాలు పెద్ద ఎత్తున చత్తీష్ గఢ్ అడవులను జల్లెడ పట్టాయి. దీంతో జనతన సర్కార్ పేరుతో చత్తీష్ గడ్‌లో సమాంతర ప్రభుత్వం నడిపిన మావోయిస్ట్ పార్టీ అనేక ఎదురు దెబ్బలు తిన్నది. ఇపుడు ఏకంగా నక్సలైట్ పార్టీ చరిత్రలో లేని విదంగా పార్టీ జనరల్ సెక్రటరీ, సుప్రీం కమాండర్‌ను ఎన్ కౌంటర్లో కోల్పోయింది.