– రాజధాని హైదరాబాద్‌లో జోరుగా విక్రయాలు
– రోజురోజుకూ విస్తరిస్తున్న వైనం
– మత్తులో హత్యలు.. దాడులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో గంజాయి సరఫరా జోరుగా సాగుతోంది. పోకిరీలు, జులాయిలు, కొందరు విద్యార్థులు సైతం గుప్పుగుప్పుమంటూ గంజాయిని సేవిస్తున్నారు. ఆ మత్తులో హత్యలు, దాడులకు తెగబడుతున్నారు. కొంతమంది పోకిరీలు మహిళలపై, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. గంజాయిని నియంత్రించే స్థాయి దాటిపోతుందని పోలీసులే అంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొనుగోలుదారులు, విక్రేతలలో కూలీల దగ్గర నుంచి విద్యార్థుల వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. పాన్‌షాపులు, కళాశాల ప్రాంగణాలు, కాలనీల్లోని గల్లీలే అడ్డాగా స్మగ్లింగ్ చేస్తున్నారు. మత్తుకు బానిసైనవారిలో కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
కొత్త తరహాలో..
గంజాయిని ఆకులు, పొడిరూపంలోనే కాకుండా, లిక్విడ్ రూపంలో కూడా తీసుకొస్తున్నారు. ప్రధానంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి నగరానికి తెస్తున్నారు. రైళ్లు, బస్సుల్లో నగరానికి తెచ్చి పరిచయస్తులకే విక్రయిస్తున్నారు. వాట్సాప్‌లో ఆర్డర్ తీసుకుని ఆన్లైన్లో పేమెంట్ చేసిన వారికి చెప్పిన ప్రాంతానికే డోర్ డెలివరీ కూడా చేస్తున్నారు. ఒక్కో స్మగ్లర్.. ఒక్కో పేరుతో (కోడ్) ఆర్డర్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి ముఠాల ఆటకట్టిస్తున్నా గంజాయి స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ముఠాలు ఇంజనీరింగ్, డిగ్రీ చదివే విద్యార్థులను సైతం స్మగ్లర్లుగా మారుస్తున్నాయి.
నల్గొండ పోలీసు తరహా చర్యలేవీ..?
హైదరాబాద్ నగరానికి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ ఏజెన్సీ నుంచి, ఒడిశా బార్డర్లలోని కొన్ని వ్యవసాయ క్షేత్రాల నుంచి గంజాయి సరఫరా అవుతున్నది. పట్టుబడిన స్మగ్లర్లను పోలీసులు విచారిస్తున్న క్రమంలో ఈ విషయం చాలాసార్లు స్పష్టమైంది. అయినప్పటికీ పోలీసులు ప్రధాన గంజాయి స్థావరాలపై దృష్టి సారించడం లేదు. దర్యాప్తులో భాగంగా లోతుల్లోకి వెళ్లడం లేదు. ఓ కేసు విషయంలో చొరవ తీసుకున్న నల్గొండ పోలీసులు గతంలో నేరుగా విశాఖ మన్యంలో దాడులు నిర్వహించారు. అక్కడ గంజాయి పండించి విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఆ తరహాలోనే హైదరాబాద్ పోలీసులు కూడా ప్రధాన స్థావరాలపై దాడులు నిర్వహిస్తేనే మెరుగైన ఫలితాలు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
హత్యలు.. దాడులు..
గ్రూపులుగా కలిసి గంజాయి సేవిస్తున్న బ్యాచ్‌లు ఆ మత్తులో హత్యలకు, దాడులకు పాల్పడుతున్నాయి. పాతకక్షలు లేదా డబ్బు కోసం చంపేందుకు సైతం వెనకాడడం లేదు. జగద్గిరిగుట్ట దీనబంధుకాలనీలో ఆదివారం జరిగిన హత్య ఈకోవకు చెందినదే. గంజాయి బ్యాచ్‌కు చెందిన యువకులు కొందరు మహ్మద్ నదీమ్‌పాషా (21) అనే యువకుడిని గొంతుకోసి, తలపై రాడ్డుతో కొట్టి దారుణంగా హత్యచేశారు. ఆదివారం ఓ స్నేహితుని పుట్టినరోజు వేడుకలు ఉండటంతో తప్పతాగిన ఖలీల్ గ్యాంగ్ సభ్యులు నదీమ్పాషాను పిలిపించి తెల్లవారుజామున 3గంటల సమయంలో రోడ్లపై పరుగెత్తించి గొంతుకోసి, తలపై రాడ్డుతో విచక్షణా రహితంగా కొట్టి హత్యచేసి పారిపోయారు. అలాగే, రాజేంద్రనగర్ నలందనగర్ కాలనీలో గంజాయి తాగిన ఐదుగురు యువకులు వాకింగ్‌కు వెళ్లొస్తున్న వ్యక్తిపై అకారణంగా దాడికి పాల్పడ్డారు. నలందనగర్కు చెందిన అనిల్‌కుమార్ తమ కాలనీ సమీపంలో వాకింగ్ చేసి తిరిగి బైక్‌పై ఇంటికి వస్తుండగా గంజాయి తాగిన ఐదుగురు యువకులు ఆయన బైక్‌ను ఆపారు. ‘అరెయ్ మా ముందే కళ్లద్దాలు పెట్టుకుని తిరుగుతావా’ అని దాడికి పాల్పడ్డారు.
…………………………………….