
* యూపీ గ్యాంగ్ పనే!
* కేసు దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు
* కీలక విషయాలు వెలుగులోకి
ఆకేరున్యూస్, సూర్యాపేట : సూర్యాపేటలోని సాయి సంతోషి జ్యువెలరీ దుకాణంలో భారీ చోరీ (Jewelry store Robbery) సంచలనం సృష్టించింది. ఏకంగా 18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదును నిందితులు దోచుకెళ్లడంతో ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. స్వయంగా ఎస్పీ నర్సింహ రంగంలోకి దిగారు. దీంతో అధికారులు దర్యాప్తులో ముందుకు సాగుతున్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. కీలక విషయాలను కనుగొన్నారు. దుండగులు రెక్కీ నిర్వహించి పక్కా పథకం ప్రకారమే దుకాణం వెనుక వైపు ఉన్న గోడకి రంధ్రం చేసి గ్యాస్ కట్టర్తో షెటర్ను కట్ చేసి షాప్ లోపలికి ప్రవేశించినట్లు ఇప్పటికే గుర్తించిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అయితే ఫేస్ మాస్కులు వేసుకొని తెలివిగా సీసీ కెమెరాలపై క్లాత్ వేసినట్లు గుర్తించారు. దీంతో పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను (CC Footages) జల్లెడ పడుతున్నారు. దుండగుల కోసం మొత్తం 5 బృందాలను రంగంలోకి దింపినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో ఈ తరహా నేరాలకు పాల్పడ్డ నేరస్థులు, ముఠాలు రాష్ట్రంలో ఇలాంటి కేసుల్లో ఎవరైనా అరెస్టు అయ్యారా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పురోగతి సాధించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ గ్యాంగుఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ గ్యాంగ్ మకాం వేసిన ఇంటిని కనుగొన్నారు. సీసీ ఫుటేజీల ద్వారా నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నారు.
………………………………………………….